Warangal News: ఆ బైక్‌పై 109 చలాన్లు - చిక్కను దొరకను అనుకున్నాడు - కానీ చిక్కాడు ! మరి బైక్ మిగిలిందా?
Bike: వరంగల్‌లో భారీ చలాన్లు ఉన్న బైక్ ను పోలీసులు సీజ్ చేశారు. చలాన్ల విలువ ఇరవై ఆరు వేల రూపాయలు.

Police seize bike with huge challans : చక్కని బైక్ ఉంది. దూసుకుపోవడానికి రోడ్లున్నాయి. ఇంకేం అనుకున్నాడో కుర్రాడు. కానీ రూల్స్ ప్రకారం వెళ్తే సమస్యలు ఉండేవి కావు. కానీ అడ్డదిడ్డంగా నడపడం అలవాటుగా చేసుకున్నాడు. రోడ్డు మీద సీసీ కెమెరాలు ఉంటాయని.. అవి లేని చోట ట్రాఫిక్ పోలీసులు కెమెరాతో రెడీగా ఉంటారని భయపడలేదు. ఆ వారేం చేస్తారులే అన్నట్లుగా రెచ్చిపోయాడు. బైక్ తో విన్యాసాలు చేశాడు. చివరికి ఇప్పుడు ఆ బైక్ కే ఎసరు వచ్చింది. ఎందుకంటే పోలీసులు సీజ్ చేశారు.
వరంగల్‌లో వాహన తనిఖీల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ సీతా రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది అశోక జంక్షన్ వద్ద పెండింగ్ చలాన్లు ద్విచక్ర వాహనాల తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఓ బైక్ ను ఆపి చలాన్లు చెక్ చేశారు. చలాన్ మిషన్ కనీసం ఒక్క నిమిషం పాటు రీడింగ్ తీసుకుంది. డీ మార్ట్ సరుకుల బిల్లుగా అలా ప్రింట్ చేస్తూనే ఉంది. పోలీసులు కూడా ఆ బైక్ డ్రైవర్ వైపు.. ఆ బైక్ వైపు చూస్తూనే ఉన్నారు. ఓ నిమిషం తర్వాతా చాలా పెద్ద చలానా బిల్లుతో ప్రింట్ ఆగిపోయింది. మొత్తం 109 ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. వాటి విలువ 26 వేల 310 రూపాయలు .
ఆ బైకర్ ను హన్మకొండ ప్రాంతానికి చెందిన బిక్షపతి గా గుర్తించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్, హెల్మెట్ లేకుండా వాహనం వంటి చలాన్లు ఉన్నాయి. అన్నింటికీ ఫోటోలు ఉన్నాయి. వాహనదారుడు బిక్షపతి కి పెండింగ్ చలాన్ల రసీదు అందజేశారు. ఫైన్లు చెల్లించేవరకు వాహనాన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ట్రాఫిక్ స్టేషన్ కు తరలించారు.
ఇక్కడ కొసమెరుపేమిటంటే పోలీసులు తనిఖీలు చేస్తున్నప్పుడు కూడా భిక్షపతికి హెల్మెట్ల లేదు. అలా దూసుకు వచ్చి దొరికిపోయాడు. మామాూలుగా ఆ బైక్ సెకండ్ హ్యాండ్ లో అమ్మితే యాభై వేలు కూడా వస్తాయో రావో కానీ ఇప్పుడు ఇంటికి వెళ్లి ఇరవై ఆరు వేల రూపాయలు తీసుకుని రావాల్సి ఉంటుంది. ఆ బిక్షపతి జులాయిగా తిరుగుతాడని పెద్దగా ఆలోచించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే కాస్త కనీస బాధ్యతగా ఏదైనా ఉద్యోగమో.. వ్యాపారమో చేసుకుని బతుకూంటే.. ఇంత నిర్లక్ష్యంగా ఉండడు. వంద కంటే ఎక్కువ సార్లు అది కూడా నాలుగైదు రోజులకోసారి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు దొరకడు.
సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాలంటే ఎవరైనా .. పోలీసులు లేని చోట.. సీసీ కెమెరాలు లేని చోట చూసుకుని మాత్రమే చేస్తారు. కానీ భిక్షపతి మాత్రం ఇలాంటివి ఏమీ పట్టించుకోలేదు. తన దారి రహదారి అని దూసుకెళ్లాడు. కానీ ఎప్పుడో సారి దొరికిపోకతప్పదు. అలా దొరికిపోయి.. ఇప్పుడు నడుచుకుంటూ ఇంటికి పోవాల్సి వచ్చింది. ట్రాఫిక్స్ రూల్స్ ఉల్లంఘించడం హీరోయిజం కాదు.. చేజేతులా నష్టాన్ని.. వినాశనాన్ని కొని తెచ్చుకోవడమే.





















