Warangal News: బీఆర్ఎస్‌కు మరో షాక్! బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
Aroori Ramesh: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారని ప్రచారం జరుగుతోంది.
Did Aruri Ramesh ready to quit BRS party: వరంగల్: బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (Aroori Ramesh) షాక్ ఇవ్వనున్నారా అంటే.. అవుననే వినిపిస్తోంది. ఇదివరకే పలువురు ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో చేరగా.. తాజాగా మాజీ ఆరూరి రమేష్ బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. త్వరలో బీజీపీ (BJP)లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా అరూరి రమేష్ బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆరూరి రమేష్ ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు.
వర్ధన్నపేట ఎమ్మెల్యేగా సేవలు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వర్ధన్నపేట నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆరూరి రమేష్ పార్టీ మారుతున్నట్లు సమాచారం. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడంతో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆరూరి రమేష్ పార్టీ మారేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆరూరి రమేష్ కు పార్టీలోకి రావాలని బీజేపీ నేతల నుంచి ఆహ్వానం అందడంతో కాషాయ పార్టీ పెద్దలతో పలుమార్లు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో ఆరూరి రమేష్ కు మంచి సంబంధాలే ఉండడంతో ఆయన ద్వారా పార్టీ మారేందుకు చర్చలు జరిపినట్లు సమాచారం.
లోక్‌సభ సీటు కోసమేనా?
వరంగల్ పార్లమెంటు టికెట్ కోసమే ఆరూరి రమేష్ బీజేపీలో చేరాలని భావించారు. ఇక్కడి నుంచి పోటీ చేసి ఎంపీగా నెగ్గి పార్లమెంట్ లో కాలు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే భావిస్తున్నారు. ఇందుకు బీజేపీ అధిష్టానం ఏం చెప్పింది, లేక వేరే ఏమైనా ఛాన్స్ ఇస్తామని చెప్పిందనే విషయంపై క్లారిటీ లేదు. కానీ బీజేపీలో ఆయన చేరిక మాత్రం కన్ఫామ్ అని సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల కొందరు నేతలు బీఆర్ఎస్ వీడటంతో రమేష్ విషయం తెలిసి పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఆరూరి రమేష్ ను బుజ్జగించడం కోసం వరంగల్ కు చెందిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను ఆయన దగ్గరికి పంపడం, అనంతరం కేటీఆర్ ఫోన్ చేయడంతో హైదరాబాద్ బయలుదేరినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ప్రస్తుతానికి ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదు. పార్టీ శ్రేణులకు, నేతలు ఎవరికీ ఫోన్లలో అందుబాటులో లేరు. దాంతో ఆరూరి రమేష్ బీజేపీలో చేరిక లాంఛనమే అనే పరిస్థితి కనిపిస్తోంది.