Bhupalpally: BRSలో భగ్గుమన్న విభేదాలు - ఎమ్మెల్సీ కవిత, మంత్రి ఎదుటే తోపులాటలు
జిల్లాకు చెందిన మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణా రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కీలక నేతల ఎదుటే బయటపడడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారత్ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నాయకుల్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఏకంగా ఎమ్మెల్సీ కవిత, ఇతర మంత్రుల ఎదుటే వారి మధ్య ఉన్న గొడవలు బట్టబయలు అయ్యాయి. జిల్లాకు చెందిన మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణా రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కీలక నేతల ఎదుటే బయటపడడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్భంగా తాజా పరిణామం చోటు చేసుకుంది.
జనవరి 22 (ఆదివారం) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కార్మిక సంఘం భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే, అదే సమయంలో జిల్లాకు చెందిన నేతలు మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణా రెడ్డి బలప్రదర్శనలకు దిగారు. ఈ క్రమంలో శిలాఫలకం మీద మధుసూదనాచారి పేరు లేదని ఆయన వర్గీయులు అక్కడికక్కడే అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ లోపు గండ్ర వెంకటరమణా రెడ్డి అనుచరులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలకు దిగాయి. ఆ తర్వాత తోపులాటలు సైతం జరిగాయి. దీంతో పోలీసులు, ఇతర నేతలు కలగజేసుకొని పరిస్థితి సరిదిద్దారు.
ములుగు జిల్లాలోనూ పర్యటన
నేడు కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లాలోనూ పర్యటించారు. ములుగు జిల్లాలో రాతితో నిర్మించిన రామప్ప ఆలయాన్ని కవిత సందర్శించారు. ఆదివారం ఉదయం కవిత ఆలయాన్ని సందర్శించి ఆలయ పరిసరాలను పరిశీలించారు. రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగానే కాకుండా చారిత్రాత్మక, మహిమాన్వితమైన పురాతన ఆలయంగా గుర్తింపు కలిగి ఉందన్నారు. అద్భుతమైన చరిత్రను, సంప్రదాయలను వినడానికి ఇలాంటి ప్రదేశాల్ని చూడటం తనకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుందన్నారు. రుద్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యునెస్కో గుర్తింపు పొందిన ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు కవిత. భవిష్యత్‌లో రామప్ప దేవాలయాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత కట్టడం రామప్ప ఆలయాన్ని కూడా వారు సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శిల్పి పేరుతో రామప్ప ఆలయాన్ని నిర్మించి కాకతీయులు ఈ ప్రాంతానికి వన్నె తెచ్చారని, యునెస్కో గుర్తింపు లభించేలా కృషి చేసి కేసీఆర్ రామప్ప ఖ్యాతి విశ్వవ్యాప్తం చేశారని అన్నారు. రామప్ప దేవాలయం మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తోందని అన్నారు.
సింగరేణి అంటే కేవలం బొగ్గు తీయడమే కాదని, విద్యుత్ ఉత్పత్తి కూడా ఆ సంస్థే చేయొచ్చు అని నిరూపిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో సింగరేణిని కాపాడుకుంటామని చెప్పారు. తెలంగాణలో సింగరేణి కార్మికులకు వస్తున్న బెనిఫిట్స్ దేశవ్యాప్తంగా ఎందుకు రావడం లేదని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న సింగరేణి కార్మికులను సోషల్ మీడియా ద్వారా చైతన్యం చేయాలని ఆమె అన్నారు. వారసత్వ ఉద్యోగాలు పొందిన 18 వేల మంది యువకులు బాధ్యతగా భావించాలని ఆమె సూచించారు. బీజేపీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.