Minister Errabelli Dayakar Rao : వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాలు, డప్పు కొడుతూ ఉత్సాహం నింపిన మంత్రి ఎర్రబెల్లి!
Minister Errabelli Dayakar Rao :వరంగల్ వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
Minister Errabelli Dayakar Rao : వరంగల్ వానకొండయ్య లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణం మహోత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి, కలెక్టర్ శివలింగయ్య పాల్గొన్నారు. కడవెండిలో స్వామి వారికి సమర్పించే పట్టు వస్త్రాల కోసం మగ్గం నేశారు మంత్రి. అనంతరం కోలాటం ఆడుతూ, చిడతలు వాయిస్తూ, డప్పు కొడుతూ భక్తుల్లో ఉత్సాహం నింపారు మంత్రి ఎర్రబెల్లి. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. వానకొండయ్య లక్ష్మీ నరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మంత్రి ఎర్రబెల్లి , అధికారులకు పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వానకొండయ్య జాతరకు మంచి ప్రాశస్త్యం ఉందన్నారు. ఈ ప్రాంతం చాలా చారిత్రాత్మకమైనదన్నారు. హోళీ పండుగ నాడు ప్రారంభం అయ్యి ఉగాది వరకు ఈ జాతర జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
"లక్ష్మీ నరసింహ స్వామి వారు మహిమాన్వితులు. వారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అయిన... మంత్రిని అయిన. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మన ప్రాంతంలో ఆలయాలను అభివృద్ది చేస్తున్నాం. అందులో భాగంగానే భక్తుల సౌలభ్యం కోసం ఘాట్ రోడ్డు నిర్మించాం. పాలకుర్తి నియోజకవర్గాన్ని నభూతో నభవిష్యత్ అనేలా అభివృద్ది చేస్తున్నాం. మరోసారి అందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు." - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
15 రోజుల పాటు ఉత్సవాలు
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆలయాల అభివృద్ధి జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి శివారు వానకొండయ్య లక్ష్మీనరసింహస్వా మి జాతర మంగళవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా హోలీ పండుగ నాడు ప్రారంభమయ్యే ఈ జాతర ఉగాది వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణ ఉత్సవాల సందర్భంగా కడవెండిలో స్వామి వారికి సమర్పించే పట్టు వస్త్రాల కోసం మంత్రి ఎర్రబెల్లి మగ్గం నేశారు. కళాకారులతో కలిసి కోలాటం ఆడుతూ, చిడతలు వాయిస్తూ డప్పు కొడుతూ ఉత్సాహంగా గడిపారు. 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్లతో పాటు గుండాల, మోత్కూర్, లింగాలఘణపురం, రఘనాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, తిరుమలగిరి తదితర మండలాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తుల కోసం ఘాట్ రోడ్డు నిర్మించామని మంత్రి తెలిపారు.
భద్రాద్రిలో వసంతోత్సవం
భద్రాద్రి సీతారామస్వామి వసంతోత్సవం వైభవంగా జరిగింది. ఈ నెల 30న జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి ముందు ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా మంగళవారం నుంచి స్వామివారి కల్యాణోత్సవం పనులకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. ఈ వేడుకల్లో భాగంగా రోలు, రోకలికి అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం ముత్తయిదువులు పసుపు కొమ్ములు దంచి పసుపు తయారుచేయడంతో పాటు కల్యాణ తలంబ్రాలు సిద్ధం చేశారు. అనంతరం బేడా మండపంలో స్వామివారిని పెండ్లి కుమారునిగా అలంకరణ చేసి ఉత్సవమూర్తులకు వసంతాలు చల్లి ఘనంగా డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. ఈ నెల 30న జరిగే సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ పనులను దేవస్థాన అర్చకులు శాస్త్రోక్తంగా మొదలుపెట్టారు.