Kishan Reddy: కేసీఆర్ రైతులకు పరిహారం ఇవ్వరు కానీ, పార్టీలకు ఇస్తారు: కిషన్‌రెడ్డి ఫైర్
Kishan Reddy: అకాల వర్షాలతో రైతులు నష్టపోతుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర రైతులను పూర్తిగా వదిలేశారని అన్నారు.
Kishan Reddy: తెలంగాణ రాష్ట్ర రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పంటల బీమా పథకం అమలు చేయాలని.. కేసీఆర్ సర్కారును అడిగితే పట్టించుకునే పరిస్థితి లేదని కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని.. అయినా కేసీఆర్ రైతులను వదిలేసి రాజకీయ పార్టీలకు నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన మహాజన్ సంపర్క్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మినహా.. అన్ని రాష్ట్రాల్లో పేదల కోసం లక్షల ఇళ్లు నిర్మిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
'రూ.10వేలకే గొప్పలా, మేం రూ.24 వేలకుపైగా ఇస్తున్నాం'
పంట సాయంగా రైతులకు ఎకరానికి 10 వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం కేవలం ఎరువుల రాయితీ రూపంలోనే ఒక్కో రైతుకు ఎకరానికి ఏడాదికి రూ. 18 వేలు ఇస్తోందని వివరించారు. అవి కాకుండా ఇతర రాయితీలతో పాటు అదనంగా మరో రూ. 6 వేలు సాయం చేస్తున్నట్లు తెలిపారు. పంట సాయం పేరుతో ఎకరాకు రూ. 10 వేలు ఇస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్.. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినా పరిహారం ఇవ్వడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి నివాసాన్ని, సచివాలయాన్ని కట్టిన కేసీఆర్ కు.. నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న స్పృహ లేదని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిరుపేదలకు లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని.. తెలంగాణలో మాత్రం రెండు పడక గదుల ఇళ్లు దిక్కులేవని కిషన్ రెడ్డి ఆరోపించారు.
కొండా వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందన
రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అయిన తెలంగాణ పదాన్ని కూడా పార్టీ పేరు నుండి తొలగించారని విమర్శించారు. రూ. 2 వేల నోట్ల రద్దుపై మాట్లాడిన కిషన్ రెడ్డి.. దేశ హితం కోసం తీసుకున్న నిర్ణయంగా అభివర్ణించారు. 2 వేల రూపాయల నోటును మార్చుకునే విషయంలో జనం ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని కిషన్ రెడ్డి సూచించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైనప్పటికీ.. ఓటు బ్యాంక్ ఏమాత్రం తగ్గలేదని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. కవిత అరెస్టు విషయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కిషన్ రెడ్డి స్పందించారు. కవిత అరెస్టు వ్యవహారం దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయని, కేంద్ర ప్రభుత్వానికి గానీ, బీజేపీ పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: BJP Konda : బీఆర్ఎస్ దోస్తీ వల్లే బ్రేకులు - బీజేపీపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసంతృప్తి !
మహబూబ్‌నగర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
అంతకుముందు మహబూబ్ నగర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర మంత్రి ప్రారంభించారు. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా రోడ్డు, రైలు, ఎయిర్ కనెక్టివిటీ ఉండాలన్నారు. వెనకబడిన పాలమూరు జిల్లా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ అవసరమని తెలిపారు. త్వరలోనే పాలమూరును అనుసంధానిస్తూ జాతీయ రహదారులు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.