(Source: ECI/ABP News/ABP Majha)
TSRTC Offers: టీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్స్, ఆగస్టు 15న ప్రత్యేక రాయితీలు!
TSRTC Offers: స్వాతంత్ర్య వజ్రోత్సవా వజ్రోత్సావల సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ ఆఫర్స్ ప్రకటించింది. ఆగస్టు 15రోజు పలు రాయితీలు అందించబోతున్నట్లు వివరించింది.
TSRTC Offers: 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఆగస్టు 15వ తేదీ రోజున ప్రయాణికులకు పలు రాయితీలు అందిస్తున్నట్లు వివరించింది. ఈ క్రమంలోనే టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. పట్టణంలోని డిపో-1 కు వెళ్లారు. స్థానిక బస్టాండ్ పరిసరాలను సందర్శించి ఆర్టీసీ అందిస్తున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ పరిసరాల్లో ఓ మొక్కను నాటారు. అక్కడ పని చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో మాట్లాడారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ఆర్టీసీ అందిస్తున్న పలు రాయితీలను గురించి ఎండీ సజ్జనార్ వివరించారు.
రేపు పుట్టబోయే పిల్లలకు 12 ఏళ్ల వరకు ఫ్రీ ప్రయాణం..!
75 ఏళ్లు దాటిన వారికి రేపు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్సిస్తున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. అలాగే రేపు పుట్టబోయే పిల్లలకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ఒక కిలో లోపు కార్గో పార్శిళ్లకు ఉచిత రవాణా సౌకర్యం అందిస్తున్నట్లు వివరించారు. వజ్రోత్సవాల సందర్భంగా నిజామాబాద్ పట్టణంలో మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని తెలిపారు. వజ్రోత్సవాల్లో భాగంగానే ముగ్గురు స్వతంత్ర్య సమరయోధులను సన్మానించనున్నట్లు స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రయాణికులు ఆదరిస్తున్నారని.. మరింత ఆదరణ అందించాలని ఎండీ సజ్జనార్ కోరారు.
తెలంగాణ ఆర్టీసీ ఆఫర్లే ఆఫర్లు..!
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ప్రతి పండుగకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ.. ప్రయాణికులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అయితే మేలో జరిగిన పదో తరగతి విద్యార్థుల పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు. పరీక్షలు జరిగినన్ని రోజులు విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. అలాగే విమానాశ్రయానికి వెళ్లి, వచ్చే ప్రయాణికులకు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి వచ్చేందుకు పుష్పక్ బస్సుల్లో ప్రయాణించే వారికి గ్రేటర్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్ మూడు గంటల పాటు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అద్భుత అవకాశాన్ని కల్పించింది. విమానాశ్రయం నుంచి పుషఅపక్ బస్సుల్లో ప్రయాణించిన టికెట్ చూపించి.. మన నివాస ప్రదేశం చేరేందుకు టికెట్ ఖరీదు చేసిన మూడు గంటల వరకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ తెలియజేసింది. ఈ సౌకర్యాన్ని పుష్పక్ ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.
అలాగే కార్గో పార్శిల్ సేవల ద్వారా వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఆర్టీసీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఆర్టీసీ కార్గో, పార్సిల్ సేవలను విస్తరించాలని యాజమాన్యం నిర్ణయించింది. పికప్, హోం డెలివరీ స్వేలను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేగంగా, భద్రంగా, చేరువగా అనే లక్ష్యంతో ఈ సేవల్ని ప్రారంభించిన ఆర్టీసీ అనతి కాలంలోనే ప్రయాణికల ఆదరణను చూరగొంది. 177 బస్ స్టేషన్లతో పాటు అధీకృత ఏజెంట్ల ద్వారా కొనసాగిస్తున్న పార్సిల్ సేవలు.. బుకింగ్, డెలివరీ పాయింట్ల నుంచే కాకుండా నేరుగా వినియోగదారుల ఇంటి వద్దకే సేవల్ని అందించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది.