గొర్రెల మందపై తోడేళ్లు పడ్డట్టు మునుగోడుపై టీఆర్‌ఎస్ లీడర్లు పడ్డారు: ఈటల
ముఖ్యమంత్రి ఆయన సహచరులు 80 మంది ఎమ్మెల్యేలు ఒక్క నియోజకవర్గంపైన గొర్రెల మందపై తోడేలు పడ్డట్టు పడుతున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Eetala Rajender On TRS Party: మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 80 ఎమ్మెల్యేలు... గొర్రెల మందపై తోడేళ్లు పడ్డట్టు మునుగోడుపై టీఆర్‌ఎస్ లీడర్లు పడ్డారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మునుగోడుకు ఎన్నో పథకాలు వస్తున్నాయని, స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే మునుగోడుకు వస్తున్నారని ఈటల రాజేంద్ర విమర్శలు గుప్పించారు. చండూరులో జరిగిన చేనేత సభలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే.. టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
80 మంది ఎమ్మెల్యేలు నియోజక వర్గంపై..
పేరుకు బతుకమ్మ చీరలు చేనేత కార్మికులతో చేయిస్తానని కేసీఆర్ చెప్పారని.. చేనేత కంట్లో కారం కొట్టి సిరిసిల్లలో మరమగ్గాల ద్వారా రూ. 250 కోట్లతో ప్రింట్ చేశారని ఈటల ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 వేల పవర్ లూమ్స్ ఉంటే కేవలం సిరిసిల్లలోనే 20 వేల పవర్ లూమ్స్ ఉన్నాయని ఈటల తెలిపారు. సిరిసిల్ల తప్పిస్తే రాష్ట్రంలో ఉన్న ఏ పవర్ లూమ్స్ కు కూడా కనీస సౌకర్యాలు కల్పించే స్థితిలో లేదని ఈటల అన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మునుగోడుకు ఎన్నో పథకాలు వస్తున్నాయని, స్వయంగా ముఖ్యమంత్రి ఈ మునుగోడుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి ఆయన సహచరులు 80 మంది ఎమ్మెల్యేలు ఒక్క నియోజకవర్గంపై గొర్రెల మందపై తోడేలు పడ్డట్టు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "తెలంగాణ గడ్డ ఆత్మ గౌరవం ఉన్న గడ్డ, ఈ గడ్డపై ధర్మమే గెలుస్తుంది. జీఎస్టీలో చేనేతకు 5 శాతం ఉండాలని కేంద్రాన్ని కోరిన వారిలో కేటీఆర్ ఒకరు. తెలంగాణ ప్రజలకు సుద్ద పూసలాగా మాటలు చెప్పారు. వారు సుద్దపూసలు కాదు మేక వన్నె పులులు" అని ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. 20 ఏళ్లలో చేనేత సమస్యలపై మాట్లాడింది చేనేత సమస్యలపై పోరాడింది ఈటల రాజేందర్ అనే విషయాన్ని మరువకండి అంటూ చేనేత సభలో వ్యాఖ్యానించారు.
ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కత్తిమీద సామే..
ప్రస్తుతం మునుగోడ ఉపఎన్నిక రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తోంది. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ పార్టీలకు ప్రతిష్టాత్మకమైన ఎన్నిక కావడంతో.. అందరి దృష్టి మునుగోడుపైనే ఉంది. బీజేపీ తమ పార్టీ చెందిన ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను మునుగోడుకు తీసుకువస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం ఎలక్షన్ అధికారులకు, పోలీసులకు కత్తిమీద సాముగా తయారైంది. మునుగడు ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరికి ఒక ఎస్సై, మండలానికి ఒక డీసీపీ మునుగోడు నియోజకవర్గంలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఒక్క చౌటుప్పల్ మండలానికి ఒక డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, 12 మంది సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు కలిపి 400 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.