TRS Fire On Sharimila : భారీ కుట్రతోనే షర్మిల పాదయాత్ర - జగన్ వల్లే నర్సంపేటకు గోదావరి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్యే !
షర్మిలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఆమె పాదయాత్ర వెనుక అంతర్గత కుట్ర ఉందన్నారు.
TRS Fire On Sharimila : తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర వెనుక భారీ కుట్రకోణం ఉందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. తన అన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ప్రజా సమస్యలు లేవా..? అని ప్రశ్నించారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు పర్యటన చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ పాదయాత్ర వెనుక అంతర్గతంగా కుట్ర దాగి ఉందన్నారు. షర్మిల టీఆర్ఎస్ నేతలపై ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదన్నారు. వైస్ జగన్ మోహన్ రెడ్డి కారణంగానే నర్సంపేట ప్రజల 70 ఏండ్ల కళ ఆవిరై పోయిందని మండిపడ్డారు.
షర్మిలపై టీఆర్ఎస్ తీవ్ర విమర్శలు
షర్మిల అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖరాయడం వల్లే నర్సంపేట ప్రజల 70 ఏళ్ల కల ఆవిరైందన్నారు. గోదావరి జలాలు రాకుండా ఆపారు అది కుట్ర కాదా అని ప్రశ్నించారు. షర్మిల ఎక్కడికక్కడే ప్రజాగ్రహం చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆంధ్రాప్రాంతం నుంచి వచ్చిన షర్మిల అడ్డగోలుగా మాట్లాడుతుందని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ మండిపడ్డారు. షర్మిల కుటుంబం తెలంగాణ వ్యతిరేక కుటుంబమన్నారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేశారన్నారు. నాడు వైఎస్ నంద్యాలలో హైదరాబాద్‌కు వెళ్లాలంటే వీసా తీసుకొని పోవాలని అన్నారని, గతంలో షర్మిల ‘హైదరాబాద్‌లో సీమాంధ్రులు బ్రతకాలంటే పాకిస్థాన్‌లో బతికినట్లు’ అనే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.
షర్మిలతెలంగాణ వ్యతిరేకి అన్న బాల్క సుమన్
వైఎస్ జగన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్లకార్డులు ప్రదర్శించారని బాల్క సుమన్ తెలిపారు. తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని షర్మిల సందర్భం వచ్చినప్పుడల్లా బయటపెడుతున్నారని, వైఎస్ సన్నిహితుడు కేవీపీ రామచందర్ రావు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజ్యసభలో నిరసన తెలిపారని బాల్క సుమన్ గుర్తు చేశారు. తెలంగాణ వ్యతిరేకులు రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. షర్మిల మాట్లాడే భాష సంస్కార హీనంగా ఉందని, ఆమె మాట్లాడే భాష ఆడబిడ్డ మాట్లాడే విధంగా ఉన్నాయా? అని ప్రశ్నించారు.చెన్నూరులో షర్మిల నాపై వ్యతిరేకంగా మాట్లాడితే.. తాను కార్యకర్తలను సముదాయించినట్లు బాల్క సుమన్ తెలిపారు. వైఎస్ కుటుంబంపై తెలంగాణ ప్రజల్లో కోపం ఉందని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని షర్మిల భర్త బ్రదర్ అనిల్ బయ్యారం గనులు కొల్లగొట్టాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అనేక భూ కబ్జాలకు పాల్పడ్డారని, షర్మిల తన భాష మార్చుకోకపోతే ఏమైనా అయితే మాకు సంబంధం లేదన్నారు.
గవర్నర్‌ను కలవనున్న షర్మిల
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం రాజ్ భవన్ కి వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో భేటీ కానున్నారు. తన అరెస్ట్ సహా టీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులు జరిపిన దాడులపై గవర్నర్ కు వివరించనున్నారు. అలాగే తన పాదయాత్రకు సంబంధించిన విషయాలను చర్చించే అవకాశం ఉంది.వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ సహా అందుకు దారి తీసిన పరిణామాలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తంచేశారు. షర్మిల భద్రత, ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల లోపల ఉండగా, కారును లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కలవరపెట్టినట్లు చెప్పారు. రాజకీయ నేపథ్యం, భావజాలం ఏదైనా కావచ్చు.. మహిళా నాయకులు, మహిళా కార్యకర్తల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరముందని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో షర్మిల గవర్నర్‌ను కలవనుండటం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది.