Revanth Reddy: 'తెలంగాణకు సీఎం కేసీఆర్ ఏం చేశారు?' - డీకే సవాల్ తో తోక ముడిచారన్న రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సవాల్ కు బీఆర్ఎస్ నేతలు తోక ముడిచారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దళితులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని గాలికొదిలేశారని, వృద్ధులకు సకాలంలో పింఛను ఇవ్వడం లేదని, పండిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో లేదని మండిపడ్డారు. సంగారెడ్డిలో ఆదివారం కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. రాజకీయంగా నష్టపోతామని తెలిసినా సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాణిక్ రావ్ థాక్రే, ఇతర సీనియర్ నేతలు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ కు సవాల్
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సవాల్ తో బీఆర్ఎస్ నేతలు తోక ముడిచారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని నిరూపించేందుకు తాము సిద్ధమని, ప్రభుత్వ పథకాలను సీఎం కేసీఆర్ చూస్తానంటే బస్సు సిద్ధంగా ఉందని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగడంపై విచారం వ్యక్తం చేసిన ఆయన, బాధ్యులను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని, సంగారెడ్డిలో జగ్గారెడ్డిని 50 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కీలక పదవి ఇస్తామని అన్నారు.
'బీఆర్ఎస్ మోసం చేసింది'
అంతకు ముందు సభలో మాట్లాడిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇక్కడి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పేవాళ్లను నమ్మవద్దని, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో ప్రతి ఒక్కరిపై రూ.5 లక్షల అప్పు ఉందన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. సంస్థలను సైతం అమ్మేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విమర్శించారు. ఇచ్చిన మాట, హామీలను నిలబెట్టుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. రాజకీయంగా నష్టం వస్తుందని తెలిసినా, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ అన్న విషయం మర్చిపోయి, బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసింది కాంగ్రెస్, కానీ తెలంగాణను మోసం చేసింది బీఆర్ఎస్ అన్నారు. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయగానే కేసీఆర్ సోనియా ఇంటికెళ్లి ఆమెను కలిశారని, కానీ మరుసటి రోజే ఆ విషయం మరిచిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పేదల కోసం ఆలోచిస్తుందని, భూ సంస్కరణలు తీసుకొచ్చింది, బ్యాంకులను జాతీయం చేశామని గుర్తు చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నాం. ఇప్పుడు తెలంగాణకు 6 గ్యారంటీలు ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి లాంటి నేతల్ని గెలిపించాలని ఖర్గే రాష్ట్ర ప్రజలను కోరారు.
Also Read: సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు: సంగారెడ్డిలో ఖర్గే