Telangana Elections 2023: సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు: సంగారెడ్డిలో ఖర్గే
Telangana Assembly Elections 2023: ఇందిరా గాంధీ సంగారెడ్డిలో అడుగుపెట్టిన తరువాత దేశమంతా కాంగ్రెస్‌ను గెలిపించిందన్నారు మల్లికార్జున ఖర్గే. సంగారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొని ఖర్గే ప్రసంగించారు.
Mallikarjun Kharge speech at Sangareddy Public Meeting
సంగారెడ్డి: ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీచేసి ఎంపీగా గెలిచి ప్రధాని అయి దేశానికి సేవ చేశారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఇందిరా గాంధీ సంగారెడ్డిలో అడుగుపెట్టిన తరువాత దేశమంతా కాంగ్రెస్‌ను గెలిపించిందన్నారు. సంగారెడ్డిలోని నుంచి గంజి మైదాన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో పాల్గొని ఖర్గే ప్రసంగించారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. ఇందిరా గాంధీ తెలంగాణ గడ్డమీద గెలవకపోయి ఉంటే ఈ సంస్థలు ఏర్పాటు అయ్యేవి కాదన్నారు.
ఇచ్చిన మాట, హామీలను నిలబెట్టుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని మల్లికార్జున ఖర్గే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ, కానీ ఆ విషయం మరిచిపోయి రాహుల్, ప్రియాంక గాంధీలపై బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసింది కాంగ్రెస్, కానీ తెలంగాణను మోసం చేసింది బీఆర్ఎస్ అన్నారు. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని, ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయగానే కేసీఆర్ సోనియా ఇంటికెళ్లి ఆమెను కలిశారని.. కానీ మరుసటిరోజే కేసీఆర్ ఆ విషయం మరిచిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పేదల కోసం ఆలోచిస్తుంది, భూ సంస్కరణలు తీసుకొచ్చింది, బ్యాంకులను జాతీయం చేశామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చాం. అందరికీ విద్య అందించేందుకు కృషిచేశామని చెప్పారు.
కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నాం. ఇప్పుడు తెలంగాణకు 6 గ్యారంటీలు ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి హామీని నెరవేర్చుతామని చెప్పారు. కర్ణాటకలో మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఒక్క లగ్జరీ బస్సు ఇస్తాం, అందులో జగ్గారెడ్డి, హనుమంతరావు లాంటి కాంగ్రెస్ నేతలు సగం మంది, బీఆర్ఎస్ నేతలు సగం మంది బస్సులో తిరిగి విషయాలు చూపించాలన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో ప్రతి ఒక్కరిపై రూ.5 లక్షల అప్పు ఉందన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. సంస్థలను సైతం అమ్మేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విమర్శించారు.
రైతులకు రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామన్నారు ఖర్గే. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తామని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల మహిళలకు రూ. 2500 ఇస్తామన్నారు. అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తాం. ప్రతి మండలంలో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. ఓట్ల కోసం ఈ విషయాలు చెప్పడం లేదు, కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజలకోసం పనిచేస్తుందన్నారు. పార్టీ శ్రేణులు అందరు కలిసి పనిచేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలని మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. అబద్ధాలు చెప్పేవాళ్లను నమ్మవద్దని, జగ్గారెడ్డి లాంటి నేతల్ని గెలిపించాలని ఖర్గే రాష్ట్ర ప్రజలను కోరారు. కేవలం ఒక్క నేత ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాదని, పార్టీ అభ్యర్థులు భారీ సంఖ్యలో విజయం సాధిస్తే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు.
అంతకుముందు సంగారెడ్డిలో ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. తారా డిగ్రీ కాలేజీ నుంచి గంజి మైదాన్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు. సంగారెడ్డి సభ అనంతరం మల్లికార్జున ఖర్గే మెదక్ బయలుదేరి వెళ్లారు.