CM KCR: ప్రచారంలో జోరు పెంచనున్న సీఎం కేసీఆర్, మరో 54 నియోజకవర్గాలపై టార్గెట్
Telangana Elections 2023: ప్రచారంలో సీఎం కేసీఆర్ జోరు పెంచేందుకు రెడీ అయ్యారు. రెండో విడతలో భాగంగా మరో 54 నియోజకవర్గాల్లో సభలకు సిద్దమయ్యారు.
Telangana News in Telugu: వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సీఎం కేసీఆర్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎక్కువ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలో నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేస్తోన్నారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కూడా నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నారు.
అయితే ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటం, కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇవ్వనుందని సర్వేలు అంచనాలు వేస్తున్న క్రమంలో మూడోసారి బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు కేసీఆర్ మరిన్ని సభలు నిర్వహించేందుకు సిద్దమయ్యారు. అందులో భాగంగా నియోజకవర్గాల పర్యటన రెండో షెడ్యూల్ తాజాగా ఖరారైంది. ఇప్పటికే అక్టోబర్ 15 నుంచి ప్రారంభమైన అధినేత పర్యటనలు నవంబర్ 3 నాటికి 12 రోజుల్లో 30 నియోజకవర్గాల్లో నిర్వహించారు. ఈ నెల 5 నుండి 8వ తేదీ వరకు మరో 11 నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. అలాగే ఈ నెల 13 నుండి 28వ తేదీ వరకు మరో 16 రోజులపాటు నియోజకవర్గాల పర్యటన కొనసాగనున్నది.
రెండో షెడ్యూల్‌లో భాగంగా 54 నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో మొత్తం 95 నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించినట్లు అవుతుంది. 13వ తేదీ నుంచి రెండో విడత పర్యటన ప్రారంభం కానుండగా.. ఆ రోజు దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట వెళ్లనున్నారు. 14న పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం, 15న బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్‌లలో పర్యటిస్తారు. ఇక 16న ఆదిలాబాద్, బోథ్, నర్సాపూర్, నిజామాబాద్ రూరల్.. 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాలలో సభలు ఏర్పాటు చేస్తారు. అలాగే 18న చేరాలలో, 19న అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తిలలో, 20వ తేదీన మానకొండూర్, స్టేషన్ ఘన్‌పూర్, నకిరేకల్, నల్లగొండలో పర్యటించనున్నారు.
ఇక 21వ తేదీన మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట.. 22వ తేదీన తాండూర్, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ఇక 23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెర్వు.. 24వ తేదీన మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.అలాగే 25వ తేదీన గ్రేటర్ హైదరాబాద్, 26న ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకలలో ప్రచారం చేస్తారు. 27వ తేదీన షాద్ నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటారు. ఇక 28వ తేదీన వరంగల్, గజ్వేల్‌లో కేసీఆర్ పర్యటించేలా ముహూర్తం ఖరారు అయింది. అయితే ఈ సారి తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా కేసీఆర్ పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీలోకి దిగేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు. కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో కూడా రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. మూడో జాబితాలో కామారెడ్డి నుంచి రేవంత్ పేరు ఉండనుంది.