Telangana News: కోటి ఎకరాలు దాటిన పంటల సాగు - 41.73 లక్షల ఎకరాల్లో వరి
Telangana News: తెలంగాణలో వానాకాలం సీజన్ లో పంటల సాగు కోటి ఎకరాలు దాటింది. ప్రస్తుత సీజన్ లో కోటి 24 లక్షల 28 వేల 723 ఎకరాలకు గాను కోటి లక్షా 72 వేల 283 ఎకరాల్లో పంటలు వేసినట్లు తెలుస్తోంది.
Telangana News: తెలంగాణలో వానాకాలం సీజన్ లో పంటల సాగు మరోసారి కోటి ఎకరాలు దాటింది. ప్రస్తుత సీజన్ లో 1,24,28,723 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను బుధవారం వరకు 1,01,72,383 ఎకరాల్లో పంటలు వేశారని ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదించింది. గతేడాది ఇదే సమయానికి 94 లక్షల 93 వేల 27 ఎకరాల్లో సాగు కాగా ఈ ఏడాది అంతకంటే అదనంగా దాదాపు ఏడు లక్షల ఎకరాల్లో పంటల సాగు మొదలైనట్లు పేర్కొంది. అత్యధికంగా 41,73,997 ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. గతేడాది ఇదే సమయానికి 30,81,517 ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ినరుటి కంటే ఈసారి దాదాపు పది లక్షల ఎకరాల్లో అధికంగా నాట్లు పడ్డాయి. వచ్చే నెల మొదటి వారం వరకు వరినాట్లు కొనసాగనున్నందువల్ల సాధారణ సాగు లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. కాగా నిరుడు మొత్తం 1.24 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి.
వర్షాకాలం సీజన్ ఆరంభంలో వర్షాలు కురవడం ఆలస్యం కావడంతో.. ఈ ఏడాది పంటల సాగు సగటును చేరుకుంటుందో లేదో అన్న అనుమానాలు రేకెత్తాయి. కానీ జులైలో భారీగా వానలు కురవడంతో పరిస్థితి కొంత మెరుగైంది. ఈనెలలో ఇప్పటి వరకు వర్షపాతం తక్కువగా నమోదు అయినప్పటికీ... ఇంకా పక్షం రోజుల సమయం ఉంది. దీంతో సగటు వర్షాపాతాన్ని దాటుతుందని.. పంటల సాగు పెరుగుతుందని వ్యవసాయశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సీజన్ లో ఇప్పటి వరకు సగటు వర్షపాతం 475.9 మిల్లీ మీటర్లు కాగా బుధవారం వరకు 583.7 మిల్లీ మీటర్లు నమోదు అయింది.
జిల్లాల వారీగా చూస్తే.. మెదక్ లో 221.29 శాతం, అదిలాబాద్ లో 104.17 శాతం, కుమురం భీం ఆసిఫాబాద్ లో 1043.53 శాతం, నిజామాబాద్ లో 103.68 శాతం సాగు చేశారు. ఈ జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణం కంటే అధికంగా పంటలు సాగు అవుతున్నాయి. నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, జనగామ, వికారాబాద్, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో 76 నుంచి 100 శాతం మేరకు పంటలు వేశారు. మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, సూర్యాపేట జిల్లాల్లో 75 శాతం మేరకు పంటలు సాగు అవుతున్నాయి. ములుగు 36.86 శాతం, వనపర్తి 25.96 శాతం జల్లాల్లో 50 శాతం కంటే తక్కువ పంటలు వేశారు.
ఇందులో వరి 49,86,634 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 71,73,997 (83.70 శాతం ) సాగు చేస్తున్నారు. అలాగే పత్తి 50,59,225 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 44,57,396 (88.10 శాతం ) సాగు చేస్తున్నారు. మొక్కజొన్న 7,13,474 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 5,06,066 (71.04 శాతం ) సాగు చేస్తున్నారు. కందులు 7,69,753 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 4,56,066 (59.25 శాతం ) సాగు చేస్తున్నారు. సోయాబీన్ 4,13,064 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 4,43,471 (107.36 శాతం ) సాగు చేస్తున్నారు. పెసలు 1,23,830 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 49,532 (40.00 శాతం ) సాగు చేస్తున్నారు. జొన్నలు 81,389 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 22,069 (27.11 శాతం ) సాగు చేస్తున్నారు. చెరుకు 63,841 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 41,142 (64.44 శాతం ) సాగు చేస్తున్నారు. మినుములు 45,259 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 19,19 (42.41 శాతం ) సాగు చేస్తున్నారు. వేరు సెనగ 30,191 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 6,439 (21.33 శాతం) సాగు చేస్తున్నారు. నువ్వులు 29,151 సాధారణ విస్తీర్ణం కాగా ప్రస్తుతం 2,599 (8.91 శాతం) సాగు చేస్తున్నారు.
అలాగే తెలంగాణలో పత్తి, సోయాబీన్, జొన్న, సజ్జలు, మొక్కజొన్న, రాగులు, పప్పు దినుసులు, వేరు సెనగ పంటలు వేయడం పూర్తయింది. వరినాట్లు వచ్చే నెల మొదటి వారం వరకు కొనసాగుతాయని వ్యవసాయ శాఖ తెలిపింది. ఈసారి పంటల సాగులో వరి అగ్ర స్థానంలో నిలవబోతుంది. నిరుడు వానాకాలం సీజన్ లో 62.12 లక్షల ఎకరాల్లో వరి పండించారు. ఈసారి ఇప్పటికే 41 లక్షల ఎకరాలు దాటగా.. వచ్చే నెల మొదటి వారం వరకు సాధారణ సాగు విస్తీర్ణాన్ని చేరుకునే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. నిరుడు పత్తి 49.58 లక్షల ఎకరాల్లో సాగు అయింది. ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్ల 44.57 లక్షల ఎకరాలకు తగ్గింది.