Harish Rao: 'కేసీఆర్ అంటే నమ్మకం.. కాంగ్రెస్ అంటే బూటకం' - బీఆర్ఎస్ సెంచరీ ఖాయమన్న మంత్రి హరీష్ రావు
Harish Rao: తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే దానికి కారణం సీఎం కేసీఆరేనని మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ నేతలు కుర్చీల కోసమే కొట్లాడుతారని విమర్శించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ అంటే ఓ నమ్మకమని, కాంగ్రెస్ అంటే ఓ బూటకమని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ లో నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. వ్యవసాయాన్ని పండుగ చేసింది కేసీఆరేనని, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి ఖిల్లాగా మారిందని అన్నారు. 'కేసీఆర్ చావు నోట్లోకి వెళ్లి ప్రత్యేక రాష్ట్రం తెచ్చారు. ఇంటింటికీ నల్లా నీరు, చెరువుల అభివృద్ధి, రైతుబంధు, దళిత బంధు వంటి పథకాలు తెచ్చాం. కాంగ్రెస్ లో కుర్చీల కోసం కొట్లాడే నాయకులున్నారు. అలాంటి వారికి ఓట్లేద్దామా? మన భవిష్యత్తు వాళ్ల చేతుల్లో పెడదామా?' అంటూ హరీష్ ప్రజలను ప్రశ్నించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను గడప గడపకూ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు
మోసం, దగాకు మారు పేరు కాంగ్రెస్ అని, ఆ పార్టీని నమ్మి ఓటేస్తే ఆగం అవుతారని హరీష్ రావు విమర్శించారు. అధికారంలోకి వస్తే గిరిజన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు సీట్ల కోసం యుద్ధాలు చేస్తున్నారని, ఢిల్లీ అహంకారం కావాలా? తెలంగాణ ఆత్మగౌరవం కావాలో? ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుందని అంటున్నారని, రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్ కావాలనుకునే వాళ్లు బీఆర్ఎస్ కు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలించే కర్ణాటకలో, బీజేపీ పాలించే మహారాష్ట్రలోనూ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటోందని, టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ నేతలే విమర్శిస్తున్నారని, అలాంటి పార్టీకి అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని సైతం అమ్మేస్తారని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇక్కడ ఏం ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తారని ప్రశ్నించారు.
'ఒకే ఒక్కడు కేసీఆర్'
తెలంగాణ ఈ రోజు అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందంటే దానికి కారణం సీఎం కేసీఆరేనని మంత్రి హరీష్ రావు కొనియాడారు. రైతులకు డబ్బులిచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే ఎకరాకు రూ.16 వేల చొప్పున రైతు బంధు ఇస్తామన్నారు. తెలంగాణ ఏటా 10 వేల మంది వైద్యులను దేశానికి అందిస్తోందని, ఐటీ, ఇతర రంగాల్లోనూ ఉద్యోగాల కల్పనలో ఫస్ట్ ప్లేస్ లో ఉందని వివరించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. పోడు భూములకు పట్టాలిచ్చి ఏజెన్సీలోని గిరిజన రైతులను ఆదుకున్నామన్నారు. రైతు బీమా మాదిరిగానే, భూమి లేని పేదలకు రూ.5 లక్షల బీమా వర్తింప చేస్తామన్నారు. ఈ పదేళ్లలో కరువు, కర్ఫ్యూ లేదని, అభివృద్ధే ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని హామీలు గుప్పించినా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, మూడోసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని హరీష్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: 'తలసరి ఆదాయంలో తెలంగాణే నెం.1' - తొమ్మిదేళ్లలో కరువు, కర్ఫ్యూ లేవన్న మంత్రి కేటీఆర్