Chennemaneni Ramesh: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
Telangana News: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు.. రూ.30 లక్షల ఫైన్ విధించింది.

Telangana High Court Rejects Chennamaneni Ramesh Citizenship Petition: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు (Chennamaneni Ramesh) బిగ్ షాక్ తగిలింది. పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సోమవారం కొట్టేసింది. ఆయన జర్మనీ పౌరుడేనని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారని.. తప్పుడు డాక్యుమెంట్లతో గత 15 ఏళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించారని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఆయనకు రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ ఫైన్ నెలలోపు చెల్లించాలని ఆదేశించింది. దీనిలో ప్రస్తుత విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ.5 లక్షలు చెల్లించాలని స్పష్టం చేసింది. కాగా, చెన్నమనేని రమేశ్ తప్పుడు సమాచారంతో ఎన్నికల్లో పోటీ చేశారంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ఆది శ్రీనివాస్ గతంలో ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
చెన్నమనేని రమేశ్ ద్వంద్వం పౌరసత్వం కలిగి ఉన్నారంటూ ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ సాగింది. ఈ క్రమంలో ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని చెన్నమనేని హైకోర్టులో సవాల్ చేశారు.
'న్యాయం గెలించింది'
అటు, హైకోర్టు తీర్పుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. తన పోరాటం ఫలించి.. న్యాయం గెలిచిందని అన్నారు. 'ఇన్నేళ్లుగా నేను చేసిన న్యాయ పోరాటానికి సహకరించిన నా ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు చెన్నమనేని రమేష్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతాను. నా ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.' అని పేర్కొన్నారు.





















