BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
Hyderabad News: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదానీ, సీఎం రేవంత్ టీషర్టులతో నిరసన తెలిపిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
BRS Leaders Arrested At Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ - అదానీ ఫోటో ముద్రించిన టీషర్టులను ధరించి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ గేట్ వద్దే నిరసన తెలిపారు. టీషర్టులతోనే లోపలికి వెళ్తామని తేల్చిచెప్పగా.. పోలీసులకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) సహా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరుపై కేటీఆర్, హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గన్ పార్క్ వద్ద నివాళి అర్పించి 'అదానీ, రేవంత్ భాయ్ భాయ్' అంటూ ముద్రించిన టీషర్టులు ధరించి బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి వచ్చారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. టీషర్టులు ధరిస్తే లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దీంతో కేటీఆర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
"అదానీ - రేవంత్ భాయ్ భాయ్" అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులు.
— BRS Party (@BRSparty) December 9, 2024
ఇదెక్కడి ప్రజాస్వామ్యం?
కనీసం టీ-షర్ట్ వేసుకుని నిరసన తెలిపే హక్కు కూడా లేదా కాంగ్రెస్… pic.twitter.com/pwYNSOayXV
రేవంత్, ఆదాని దోస్తీ టీ షర్టులతో నిరసన తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు. pic.twitter.com/kycISjKXtr
— BRS Party (@BRSparty) December 9, 2024
శాసనసభలోకి వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసిన పోలీసులు.
— BRS Party (@BRSparty) December 9, 2024
పార్లమెంట్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు అదానీ, మోడీ భాయ్ భాయ్ అనే స్లోగన్స్ తో టీషర్ట్స్ వేసుకుని వెళ్లారు, అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో మాత్రం అదే అదానీ-రేవంత్ చీకటి… pic.twitter.com/ZDKZY3n05Z
'దుర్మార్గ వైఖరిని ఎండగడతాం'
పార్లమెంటుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు అదానీ ఫోటో ఉన్న టీషర్టులు ధరించి వెళ్లారని కేటీఆర్ తెలిపారు. 'లగచర్ల ప్రజల తరఫున నిరసన తెలిపేందుకు సభకు వెళ్తున్నాం. బలవంతపు భూసేకరణను వ్యతిరేకంగా రైతుల తరఫున పోరాడతాం. నడిరోడ్డుపైనే ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సమంజసమా.?. అదానీకి కాంగ్రెస్ నేతలు దాసోహం అంటున్నారు. అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం. పోలీసులను అడ్డు పెట్టుకుని సభకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ కడుతున్నారు. ఆ పార్టీ దుర్మార్గ వైఖరికి వ్యతిరేకంగా అసెంబ్లీలో నిరసన తెలుపుతాం.' అని పేర్కొన్నారు.
'అదానీతో చీకటి ఒప్పందాలు'
అటు, శాసనసభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకొని అరెస్టులు చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. 'అదానీ దొంగ అని, అవినీతి చేశాడని రాహుల్ గాంధీ తిడితే, రేవంత్ రెడ్డి ఇక్కడ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. వివిధ మార్గాల్లో ప్రతిపక్షాలు నిరసనలు తెలియచేస్తుంటాయి. అడ్డుకోవడం దుర్మార్గం. చీకటి ఒప్పందాలు బయట పడుతాయనే ప్రతిపక్షాన్ని సభలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. మేము ప్రశ్నిస్తామని భయపడుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాలని ఎవరైనా ఉద్యమించారా.?. కొత్తగా రూపొందించిన విగ్రహంలో బతుకమ్మను తొలగించి చెయ్యి గుర్తు పెట్టారు. అలా చేయడం తెలంగాణ మహిళలను కించపరచడమే. ఇది రాష్ట్ర ప్రజలకు అవమానం.' అని మండిపడ్డారు.