Telangana News: గణేష్ నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు... ఆ విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దు.. ట్యాంక్ బండ్ వైపు ఆంక్షలు
గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణలో గణేశ్ చతుర్థి ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని ఆంక్షలు విధించింది. అలాంటి విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి కుంటల్లో నిమజ్జనం చేయాలని సూచించింది. ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, పోలీసులను ఆదేశించింది. గణేశ్, దుర్గాదేవి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై గతంలో న్యాయవాది మామిడి వేణుమాధవ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ పై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు గురువారం తుది తీర్పును ఇచ్చింది.
Also Read: Divine Flowers: ఏ దేవుడికి ఏ పూలతో పూజ చేస్తే మంచిది?
ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనం వద్దు
హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్ వైపు నుంచి నిమజ్జనం చేయొద్దని పీవీ మార్గ్, నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కు రోడ్డు ప్రాంతాల్లో చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. హుస్సేన్‌సాగర్‌లో రబ్బర్ డ్యాం తరహా ఏర్పాట్లు చేసి నిమజ్జనం చేయాలని ఆదేశించింది. నిమజ్జనం తర్వాత అక్కడి వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని సూచించింది. దూరం నుంచి వచ్చే భక్తులు హుస్సేన్‌సాగర్ వైపు రాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇళ్లలోనే నిమజ్జనం పూర్తి చేసేలా చూడాలని తెలిపింది.
విస్తృత ప్రచారం చేపట్టండి
వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో కోవిడ్ నిబంధనలు తప్పకపాటించాలని హైకోర్టు సూచించింది. నిమజ్జనం రోజు జీహెచ్‌ఎంసీ అధికారులు ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించింది. పర్యావరణానికి విఘాతం కలిగించే విగ్రహాలు ప్రోత్సహించవద్దని తెలిపింది. రోడ్లపై ఆటంకం కలిగించేలా మండపాలు ఉండకూడదని పేర్కొంది. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి ధ్వని కాలుష్యం రాకుండా చూడాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఈ ఆదేశాలపై ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది
Also Read: Telugu Recipes: విఘ్నాధిపతికి గోధుమ కుడుముల నైవేద్యం...
Also read: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే వెజిటబుల్ పాన్ కేక్
Also Read: Devotional: పక్కింట్లో పూలు కోసి పూజలు చేస్తున్నారా….అయితే మీరు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి…