Andhra Pradesh: నేనేమీ వీరప్పన్ లా స్మగ్లర్ కాదు... తాగేందుకు డబ్బు ఇవ్వడంలేదు.... మంత్రి గుమ్మనూరు జయరాం కీలక వ్యాఖ్యలు
తాగొద్దు ఆరోగ్యం పాడై పోతుందంటే.. సీఎం అన్ని పథకాల కింద డబ్బు ఇస్తున్నారు కానీ, తాగేందుకు డబ్బు ఇవ్వడంలేదని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్ణాటక నుంచి అక్రమ మద్యం వస్తుందన్నారు.
తాగేవాడిని తాగొద్దు ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని, కుటుంబాలు దెబ్బతింటాయి అని చెబితే... అన్ని పథకాల కింద ముఖ్యమంత్రి డబ్బు ఇస్తున్నారు కానీ, తాగేందుకు డబ్బు ఇవ్వడం లేదని అంటున్నారు ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. తాగేవాడిని మనం మార్చలేమని తెలిపారు. తన నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉన్నందున అర కిలోమీటరు దూరంలో ఉండడం వల్ల మద్యం ఏరులై పారుతోందన్నారు. అక్కడి నుంచి మద్యం తెచ్చుకుని తాగుతారని వ్యాఖ్యానించారు. మద్యం ఏరులై పారుతోందంటే తానేం చేయాలని ప్రశ్నించారు. బుధవారం మంత్రి గుమ్మనూరు జయరాం సీఎం జగన్‌ను కలిశారు.
వీరప్పన్ లా స్మగ్లింగ్ చేయలేదు
సీఎంని కలిసి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక ట్రాక్టర్లు వదలాలని ఎస్సైని బెదిరించారని వచ్చిన ఆరోపణలపై సీఎంకి వివరణ ఇచ్చారా అని విలేకరులు మంత్రిని ప్రశ్నంచారు. ఈ ప్రశ్నకు మంత్రి జయరాం స్పందిస్తూ అసలు ఈ విషయం ముఖ్యమంత్రికి తెలియదన్నారు. దందాలు చేసేందుకు తానేమీ వీరప్పన్‌లా ఏనుగు దంతాలు, గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేయలేదని మంత్రి అన్నారు. మట్టి తోలుకున్నాక తిరిగొస్తున్న ఖాళీ ట్రాక్టర్లను ఎస్సై ఆపితే అవి రైతులవి కాబట్టి వదిలేయమని చెప్పిన మాట వాస్తవమని మంత్రి తెలిపారు. తాను ఎక్కడా ఏయ్ ఎస్సై, ఇసుక ట్రాక్టర్లను వదలండి అని బెదిరించలేదన్నారు.
బహిరంగ చర్చకు సిద్ధమా...
అడ్డదారిన మంత్రి అయిన లోకేశ్ తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జయరాం విమర్శించారు. ట్వీట్‌లు కాదు ధైర్యం ఉంటే బహిరంగంగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంత్రిగా తన శాఖకు సంబంధించిన పనులు, కష్టపడిన కార్యకర్తలకు గురించి మాట్లాడేందుకు సీఎంని కలిశానని చెప్పుకొచ్చారు.
లోకేశ్ విమర్శలు
ఇసుక ట్రాక్టర్లను వదిలేయమని మంత్రి గుమ్మనూరు జయరాం ఎస్సైకి ఫోన్ కాల్ చేసిన వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శలు చేశారు. ప్రజాసమస్యలపై ఎప్పుడు స్పందించని మంత్రి జయరాం తన అక్రమ ఇసుక దందాకి సహకరించకపోతే ధర్నా చేస్తానని పోలీసులను బెదిరించడం వైసీపీ పాలనకు మచ్చుతునక అని విమర్శించారు. బెంజ్ మంత్రి జయరాంపై ఏం చర్యలు తీసుకోబోతున్నారని సీఎం జగన్‌ని లోకేశ్ ప్రశ్నించారు.
Also Read: Lokesh Tour Tension : నర్సరావుపేటలో టెన్షన్ టెన్షన్ - లోకేష్‌కు పర్మిషన్ లేదన్న పోలీసులు !