Liquor Licence: వామ్మో అన్ని దరఖాస్తులా? మద్యం దుకాణాల లైసెన్సులకు వెల్లువెత్తిన అప్లికేషన్లు
Liquor Licence In Telangana: తెలంగాణలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
Liquor Licence Application In Telangana:
తెలంగాణలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. 2021-23 మద్యం టెండర్ల కాలపరిమితి నవంబర్‌లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త పరిమిషన్లకు మూడునెలల ముందుగానే దరఖాస్తులు ఆహ్వానించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు కొత్తగా లైసెన్సులు జారీ చేసేందుకు ఈ నెల 3న ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023-25 కాలపరిమితికి ఈ నెల 4 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. శుక్రవారంతో దరఖాస్తులకు గుడువు ముగియనుండడంతో చివరి రోజు ఆశావహులు పెద్ద ఎత్తున ఎక్సైజ్ కార్యాలయాల వద్ద బారులు తీరారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
చివరి రోజు త్యధికంగా శంషాబాద్, సరూర్‌నగర్‌లో 8వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గురువారం వరకు 69,965 వచ్చిన దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,399 కోట్లు ఆదాయం సమకూరింది. 2021లో వచ్చిన రూ. 1,357 కోట్ల కంటే ఎక్కువని అధికారులు తెలిపారు. చివరి రోజు భారీ ఎత్తున దరఖాస్తులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
డ్రాలో పాల్గొనే వారు రూ.2 లక్షలు నాన్ రిఫండ్ (డీడీ)తో దరఖాస్తు సమర్పించారు. ఈ నెల 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. డ్రా ద్వారా గౌడ్‌లకు 15 శాతం (363 దుకాణాలు), ఎస్సీలకు పది శాతం (262 దుకాణాలు), ఎస్టీలకు ఐదు శాతం (131 దుకాణాల) చొప్పున కేటాయించనున్నారు. ఈ మూడు కేటగిరీలకు కలిసి 756 మద్యం దుకాణాలు కేటాయించినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. మిగిలిన 1,864 మద్యం దుకాణాలు ఓపెన్ కేటగిరీ కింద లైసెన్సులు జారీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు లాటరీ ద్వారా దుకాణాల లైసెన్సులను కేటాయించనున్నారు. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో భాగంగా ఈ కొత్త దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.
ఎందుకంత డిమాండ్
తెలంగాణాలో మద్యం దుకాణాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. మద్యం విక్రయాల్లో తెలంగాణ దేశంలోనే టాప్ ప్లేస్‌లో ఉంటోంది. పండుగలు, ప్రత్యేకమైన రోజుల్లో చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రికార్డులను మరో సినిమా తిరగరాసినట్లు తెలంగాణ మద్యం విక్రయాలు సైతం రికార్డులు నమోదు చేస్తున్నాయి. గత మే నెల లెక్కలే ఇందుకు ఉదాహరణ. మే నెలలో రూ.3,285 కోట్ల మద్యం అమ్మకాలు జరగాయి. అందులో మే 31 ఒక్కరోజే రూ.300 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఆ ఒక్కరోజే 2,55,526 లక్షల కేసుల బీర్లు, 3,31,961 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగాయి.
తెలంగాణలో మెుత్తం 2,620 మద్యం దుకాణాలు ఉండగా వెయ్యికిపైగా బార్లు, క్లబ్లు, పర్యాటక హోటళ్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రూ.100 నుంచి రూ.150 కోట్లు విలువైన మద్యం విక్రయం జరుగుతోంది. 2022-,23 ఆర్థిక సంవత్సరంలో రూ.35,145.10 కోట్లు విలువైన 3.52 కోట్లు లిక్కర్ కేసులు, 4.79 కోట్లు బీరు కేసులు అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలకు డిమాండ్ పెరిగింది. రెండేళ్ల పాటు అనుమతులు లభిస్తే కోట్లు సంపాదించవచ్చని దరఖాస్తుదారుల నమ్మకం.