(Source: ECI/ABP News/ABP Majha)
Telangana రాష్ట్రంలో చిత్రవిచిత్రమైన సంఘటనలు - ట్విట్టర్ వార్ మొదలుపెట్టిన కేసీఆర్
Telangana News: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో రాష్ట్రంలో చిత్రవిచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన కాంగ్రెస్ పాలనపై సెటైర్లు వేశారు.
మహబూబ్ నగర్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ట్విట్టర్ (ఎక్స్)లో ఖాతా తెరిచారు. మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆయన మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పాలమూరులో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఏ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో ప్రస్తుతం అదే నియోజకవర్గంలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సమయలో పాలమూరులో ఉండేలా కేసీఆర్, బీఆర్ఎస్ ప్లాన్ చేశాయని అంతా భావిస్తున్నారు. ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పుడే ట్వీట్ వార్ మొదలుపెట్టారు.
తెలంగాణలో చిత్రవిచిత్రమైన సంఘటనలు అంటూ ట్వీట్
తెలంగాణ రాష్ట్రంలో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని కేసీఆర్ ట్వీట్ చేశారు. కరెంటు పోవడం లేదని ప్రతి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఊదరగొడుతున్నారని సెటైర్లు వేశారు. కానీ అసలు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. తాను గంట కిందట మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తుంటే రెండు సార్లు కరెంటు పోయిందని తన ట్వీట్ లో కేసీఆర్ రాసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కరెంట్ ఇవ్వడం రాదని, వైఫల్యం కనిపిస్తుందని విమర్శించారు.
తనతో పాటు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, వారి నియోజకవర్గాల్లో సైతం రోజుకు 10 సార్లు కరెంటు పోతోందని తనకు చెప్పారని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది అన్నారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఈ పరిస్థితులపై ఇకనైనా ఆలోచించాలని, జై తెలంగాణ అని కేసీఆర్ ట్వీట్ చేశారు.