Telangana Elections 2023: హరీష్ రావు నోట 'రైతుబంధు' మాట - నిధుల విడుదలకు ఈసీ బ్రేక్
Telangana News: తెలంగాణలో రైతు బంధు నిధుల విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ 2 రోజుల క్రితం ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకుంది.
EC Withdraws Rythu Bandhu Permission: తెలంగాణ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం (Central elections commission) కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం 'రైతుబంధు' (Rythu Bandhu) నిధుల విడుదలకు ఇచ్చిన అనుమతిని తాజాగా ఉపసంహరించుకుంది. ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో రైతుబంధు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 28న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.7 వేల కోట్లు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. తాజా నిర్ణయంతో నగదు పంపిణీ నిలిచిపోయింది.
హరీష్ రావు నోట 'రైతుబంధు' మాట
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీష్ రావు తన ప్రసంగంలో రైతుబంధు నిధుల విడుదలకు సంబంధించి ప్రస్తావించారు. 'మీరు సోమవారం టీ తాగే సమయానికి టింగ్ టింగ్ టింగ్ అంటూ రైతుల ఫోన్లకు నిధులు జమ అయినట్లు మెసేజ్ లు వస్తాయి.' అని అన్నారు. కాగా, సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది. కానీ, హరీష్ రావు సోమవారమే డబ్బులు పడతాయని ప్రకటించారు. అటు నవంబర్ 30న పోలింగ్ కాగా, ఇప్పుడు రైతుబంధుకు అనుమతులు ఏంటీ.? అనే ఫిర్యాదులు ఈసీకి వెళ్లాయని తెలుస్తోంది. వీటిని పరిశీలించిన ఎన్నికల సంఘం హరీష్ రావు వ్యాఖ్యలను, పత్రికల్లో వచ్చిన కథనాలను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించారని నిధుల విడుదలకు ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఆ షరతు ఉల్లంఘించారు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'రైతుబంధు' నిధుల విడుదలకు ఈసీ రెండు రోజుల క్రితం అనుమతిచ్చిన సమయంలో, ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నిధుల విడుదల అంశాన్ని ప్రచారంలో ఎక్కడా ప్రస్తావించవద్దనే షరతు విధించింది. ఈ పథకం పేరును ప్రస్తావిస్తూ, ఎన్నికల్లో లబ్ధి పొందే వ్యాఖ్యలు చెయ్యొద్దని పేర్కొంది. 2018 అక్టోబరు 5న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను పూర్తి చేయాలని నిర్దేశించింది. అయితే, హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ నిబంధన ఉల్లంఘించారని ప్రస్తావిస్తూ అనుమతి వెనక్కు తీసుకుంటూ ఆదేశాలిచ్చింది.
నిలిచిన పంపిణీ
రైతుబంధు కింద ప్రభుత్వం ఏటా పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2 సీజన్లకు మొత్తం రూ.10 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. వానాకాలంతో పాటు యాసంగి సీజన్ ఆరంభానికి ముందే నిధులు విడుదల చేయడం ఆనవాయితీ. అయితే, ఈసారి శాసనసభ ఎన్నికల దృష్ట్యా కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వం నుంచి యాసంగి సీజన్‌కు నిధుల జమ జరగలేదు. ఇది కొనసాగుతోన్న పథకమని, దీనికి కోడ్ వర్తించదని, నిధుల విడుదలకు అనుమతించాలని ప్రభుత్వం గత నెలలో ఈసీని కోరుతూ లేఖ రాసింది. దీన్ని పరిశీలించిన ఈసీ నిధుల జమకు అనుమతించింది. అయితే, తాజాగా అనుమతి నిరాకరించడంతో రైతుబంధు పంపిణీ నిలిచిపోయింది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply