CM Revanth Reddy: 'రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు' - విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమన్న సీఎం రేవంత్
Telangana News: రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దని యువతకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మంచిర్యాల జిల్లా సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులతో ఆయన సోమవారం ముచ్చటించారు.
CM Revanth Reddy Chit Chat With Students: రాష్ట్రంలో గత పదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని.. ప్రజా ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ (Prem Sagar) ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నివాసానికి తరలి వచ్చిన విద్యార్థులతో రేవంత్ ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సొంత హాస్టల్ భవనం నిర్మించాలని విద్యార్థులు కోరగా.. స్థల సేకరణ చేయించిన అనంతరం సొంత హాస్టల్ భవనం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 'ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం. త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. యువజన సంఘాలు బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించేలా చొరవ చూపాలి. స్కూల్స్, కాలేజీల్లో డ్రాపవుట్స్ తగ్గించాలి.' అని సీఎం పేర్కొన్నారు.
'వ్యసనాల బారిన పడొద్దు'
యువత విద్యను నిర్లక్ష్యం చేయొద్దని సీఎం రేవంత్ సూచించారు. గంజాయి, డ్రగ్స్ అన్నింటికంటే పెద్ద ప్రమాదకరమని.. అలాంటి వ్యసనాల బారిన పడొద్దని అన్నారు. 'విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కండి. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు. విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమే. చదువుకున్న వారు ప్రయోజకులవుతారు. పాఠశాలల్లో విద్యతో పాటు సామాజిక అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు గ్రూప్ డిస్కషన్స్ ఏర్పాటు చేయాలి. ఉన్నత చదువులు చదువుకుని.. తెలంగాణ పునర్నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలి. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా కార్పొరేట్ విద్యను తలదన్నే రీతిలో విద్యను అందిస్తూ సౌకర్యాలు కల్పిస్తాం.' అని పేర్కొన్నారు.
కలెక్టర్లకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను జిల్లా కలెక్టర్లు వారానికోసారి సందర్శించి సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలు వెలుగులోకి వస్తాయన్నారు. విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు సకాలంలోనే పంపిణీ చేశామని చెప్పారు. యూనిఫామ్స్ కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించి కుట్టు కూలీ పెంచినట్లు వెల్లడించారు. విద్యార్థులను స్వయంగా కలుసుకుని సమస్యలు ఆలకించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ప్రయోజకులై తెలంగాణ పురోగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును ఈ సందర్భంగా సీఎం రేవంత్ అభినందించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా దండేపల్లి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు మద్యం సేవించమని ప్రతిజ్ఞ చేశారు. పార్టీ విధానాలను ముందుకు తీసుకెళ్తూ.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ నడిచేలా వ్యవహరిస్తామని చెప్పారు. వీటన్నింటినీ అనుసరిస్తూ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ తన అనుచరులను మంచిమార్గంలో నడిపిస్తున్నందుకు సీఎం ఎమ్మెల్యేను అభినందించారు.
Also Read: TGSRTC Charges Hike: టికెట్ చార్జీల పెంపుపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు - టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్