(Source: ECI/ABP News/ABP Majha)
TGSRTC Charges Hike: టికెట్ చార్జీల పెంపుపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు - టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
TSRTC Charges Hike: దీపావళి పండుగ సమయంలో ఆర్టీసీ టికెట్ చార్జీల పెంపుపై దుష్ప్రచారం జరుగుతోందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటన విడుదల చేశారు.
TSRTC News | టీజీఎస్ఆర్టీసీ బస్సు టికెట్ ధరలను పెంచిందని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రెగ్యులర్ సర్వీస్‌లకు సాధారణ చార్జీలే అమల్లో ఉన్నాయని, దీపావళి (Diwali 2024) సమయంలో తిరుగు ప్రయాణ రద్దీలో ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఛార్జీలు సవరించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం పండుగ వేళ చార్జీలను సంస్థ సవరించినట్లు స్పష్టం చేశారు.
ప్రధాన పండుగులు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ ఉండకపోవడంతో ఆ స్పెషల్ బస్సులు (Special Buses) ఖాళీగా వెళ్తుంటాయి. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16న ప్రభుత్వం జారీ చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ నడిపే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.50 వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటు ఆర్టీసీకి ఇచ్చారు. గత 21 ఏళ్లుగా అనవాయితీగా వస్తోన్న ప్రక్రియను తాజాగా దీపావళికి కొనసాగించిట్లు చెప్పారు.
దీపావళి సమయంలో రెగ్యులర్ సర్వీసుల ద్వారా ప్రయాణికులను సొంతూళ్లకు చేర్చాం. కానీ తిరుగు ప్రయాణంలో కరీంనగర్, ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ (Hyderabad)కి రద్దీ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఆది, సోమవారాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులను నడిపాం. ఆదివారం నాడు కరీంనగర్ రీజియన్ నుంచి 127, రంగారెడ్డి నుంచి 105, ఆదిలాబాద్ నుంచి 16, వరంగల్ నుంచి 66 మొత్తంగా 360 ప్రత్యేక బస్సులను హైదరాబాద్‌కు నడిపినట్లు ఆర్టీసీ తెలిపింది. సోమవారం సాయంత్రం వరకు ఆయా ప్రాంతాలనుంచి మరో 147 సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు.
Also Read: TGSRTC Special Buses: కురుమూర్తి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, టికెట్ బుకింగ్స్ ఇలా
జీవో ప్రకారం ఛార్జీల సవరణ
ఈ స్పెషల్ బస్సుల్లో మాత్రమే జీవో ప్రకారం చార్జీలను సవరించాం. ఈ స్పెషల్ బస్సులు మినహా మిగతా బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉన్నాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. స్పెషల్ సర్వీసుల్లో ప్రభుత్వ జీవో ప్రకారం టికెట్ ధరలను సవరించినట్లు ఆర్టీసీ యాజమాన్యం మరోసారి స్పష్టం చేస్తుంది. సాధారణ రోజుల్లో యథావిధిగా సాధారణ టికెట్ ధరలే ఉండగా.. స్పెషల్ బస్సు సర్వీసులకు టికెట్ ధరలను సవరించడం ఆర్టీసీలో అనవాయితీగా వస్తోంది.