Pathala Bhairavi: పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
Sr NTR Pathala Bhairavi: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావును స్టార్ చేసిన సినిమా 'పాతాళ భైరవి'. మార్చి 15కు సినిమా విడుదలై 75 ఏళ్ళు. ఈ సందర్భంగా ఆ మూవీ సంగతులు తెలుసుకోండి

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (NTR)ను రాత్రికి రాత్రి సూపర్ స్టార్ చేసిన 'పాతాళ భైరవి' (Pathala Bhairavi) సినిమా రిలీజై 75 ఏళ్ళు అయింది. మార్చి 15, 1951న రిలీజైన ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలోనే టాప్ 5 క్లాసిక్స్ లో ఇప్పటికీ నిలిచిపోయింది. స్క్రీన్ ప్లే, నటన, మ్యూజిక్, లైటింగ్, కెమెరా ట్రిక్స్, డైలాగ్స్, దర్శకత్వ ప్రతిభ పరంగా ఈ మూవీ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. హీరోయిజాన్ని ఒక కొత్తగా ప్రెజెంట్ చేసిన 'పాతాళ భైరవి' కథా రచనకు కొత్త పాఠాలు నేర్పింది.
తోట రాముడిగా మారిన అల్లా ఉద్దీన్
'పాతాళ భైరవి' కథ నిజానికి కొత్తగా పుట్టిన స్టోరీ కాదు. అప్పటికే బాగా పాపులర్ అయిన జానపద కథలు 'కాశీ మజిలీలు' నుంచి ఒక కథను తీసుకుని దానికి అరేబియన్ నైట్స్ లోని 'అల్లా ఉద్దీన్ - అద్భుతదీపం' కథతో కలిపి రచయిత పింగళి నాగేంద్ర రావు అద్భుతమైన రచన చేశారు. అప్పటికే తొలి ప్రయత్నంగా 'షాహుకారు' సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన విజయా స్టూడియో నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి తమ రెండో సినిమాగా 'పాతాళ భైరవి'ని నిర్మించారు. డైరెక్టర్ గా 'భక్త పోతన, యోగి వేమన, గుణ సుందరి కథ' లాంటి మూడు సూపర్ హిట్స్ తీసిన కేవీ రెడ్డిని 'పాతాళ భైరవి'కి డైరెక్టర్ గా పెట్టుకోవడంతో ఆయన, కమలాకర కామేశ్వర రావు కలిసి తమకు తగ్గట్టుగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. కథలో తోట రాముడిగా ఎన్టీఆర్, మాంత్రికుడుగా ఎస్వీ రంగారావు నటించారు. మాలతి హీరోయిన్. రాజుగారి బావ మరిదిగా రేలంగి, మాంత్రికుడి శిష్యుడుగా పద్మనాభం, తోటరాముడి స్నేహితుడిగా అంజి కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్,SVR ఇద్దరికీ ఈ సినిమా కెరీర్లో కీలక మలుపుగా నిలిచిపోయింది.
అక్కినేని నుంచి ఎన్టీఆర్‌కు చేరిన తోటరాముడు
'పాతాళ భైరవి' సినిమా వచ్చేసరికే అక్కినేని టాలీవుడ్ లో చాలా పెద్ద స్టార్. జానపద సినిమాలన్నీ ఆయనతో తీసేవారు. 'కీలు గుఱ్ఱం', 'బాలరాజు' సినిమాలు సూపర్ డూపర్ హిట్లు కావడంతో ఆయనతో 'పాతాళ భైరవి' తీయాలని నిర్మాతలు అనుకున్నారు. అయితే దర్శకుడు కె.వి.రెడ్డి మాత్రం తోటరాముడు పాత్రకు ఎలాంటి ఇమేజ్ లేని నటుడు అయితే మంచిదని భావించారు. విజయా ఆఫీసుకు ఏదో పని మీద వచ్చిన ఎన్టీఆర్ ను చూసి కె.వి.రెడ్డి ఆయనే తన హీరో అని ఫిక్స్ అయిపోయారు. అలాగే ముందుగా విలన్ పాత్రకు సీనియర్ నటుడు ముక్కామలను అనుకున్నా హీరో పాత్ర ఏఎన్ఆర్ నుంచి ఎన్టీఆర్ కి వెళ్లిపోవడంతో విలన్ కూడా పెద్దగా ఇమేజ్ లేని నటుడు అయితే బాగుంటుందని భావించి అప్పటికే చిన్న పాత్రలు చేస్తున్న ఎస్వీ రంగారావుని మాంత్రికుడిగా ఎంచుకున్నారు.
Also Read: Allu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?
తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి 'పాతాళ భైరవి' సినిమాను తీశారు. తెలుగు వెర్షన్ మార్చి 15, 1951న విడుదల అయితే తమిళ్ వెర్షన్ రెండు నెలల తర్వాత మే 17, 1951న రిలీజ్ అయింది. రెండు భాషల్లోనూ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో 175 రోజులు, డైరెక్ట్ గా 200 రోజులు ఆడిన ఫస్ట్ మూవీ ఇదే. తర్వాత దీని హిందీ రైట్స్ తీసుకున్న జెమిని స్టూడియోస్ అధినేత వాసన్ రెండు పాటల్ని కలర్ లో షూట్ చేసి హిందీ లో డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడా హిట్ అయింది. బొంబాయిలో 1952లో జరిగిన మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సౌత్ ఇండియా నుంచి ప్రదర్శించబడిన ఏకైక సినిమా 'పాతాళ భైరవి'నే. CNN -IBN సంస్థ ప్రకటించిన ఆల్ టైమ్ 100 గ్రేటెస్ట్ ఇండియన్ సినిమాల్లో 'పాతాళ భైరవి'ని ప్రముఖంగా పేర్కొన్నారు.
కలర్ లోకి ఎందుకు మార్చలేదంటే?
హైదరాబాద్ కు సంబంధించిన గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ అనే సంస్థ విజయా వాళ్ళు రూపొందించిన 14 సినిమాల నెగిటివ్ రైట్స్ తీసుకున్నారు. అందులో ముందుగా మాయాబజార్ సినిమాను 2010లో కలర్ లోకి మార్చారు. తర్వాత 'పాతాళ భైరవి'ని కూడా కలర్ లోకి మార్చి డిజిటల్ వెర్షన్ తీసుకొస్తామన్నారు. అయితే కలర్ మాయాబజార్ హిట్ కావడం తో అప్పటికే పాతాళభైరవి సినిమా రైట్స్ తీసుకున్న టీవీ చానల్స్ నుండి లీగల్ ఇష్యూస్ ఎదురవుతుండడంతో తమ ప్రయత్నాలను ఆ సంస్థ మానుకుంది.
'పాతాళ భైరవి ఎందుకంత హిట్ అయిందంటే?
'పాతాళ భైరవి' తెలుగు నడకను మార్చేసింది. అంత వరకు సినిమాల స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉండేది. దర్శకుడు కె.వి.రెడ్డి ఈ సినిమా కథను చాలా వేగంగా నడిపారు. అందుకే ఎక్కడా బోర్ కొట్టదు. అలాగే కెమెరామెన్ మార్కస్ బార్ట్లే లైటింగ్, కెమెరా ట్రిక్స్ తో అద్భుతాలు సృష్టించారు. వాటికి ఘంటసాల సంగీతం తోడు కావడంతో ప్రేక్షకులు తెరకు అతుక్కుపోయేవారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమా డైలాగ్స్ గురించి. సినిమాకు కథ అందించిన పింగళి డైలాగ్స్ కూడా రాశారు. 'సాహసం సేయరా డింభకా', 'నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా', 'నరుడా ఏమి నీ కోరిక', 'డింభకా', 'డింగిరి' లాంటి డైలాగ్స్, పదాలు తెలుగు వ్యవహారిక భాషలో కలిసిపోయాయి. 75 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ జనం మాటల్లో అవి వినిపిస్తూనే ఉంటున్నాయంటే ఈ సినిమా ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
Also Read: ఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల
సామాన్యుడిని కథానాయకుడిగా మార్చిన సినిమా
'పాతాళ భైరవి' రిలీజ్ కి ముందు తెలుగులో వచ్చిన సూపర్ హిట్లు ప్రధానంగా భక్తి సినిమాలు. భక్త పోతన, త్యాగయ్య లాంటి భక్తి కరుణ రస ప్రధాన సినిమాలు, లేదా అక్కినేని నటించిన బాలరాజు, కీలుగుర్రం లాంటి సినిమాల్లో శాపం వల్ల మానవుడిగా పుట్టిన యక్షుడో, రాకుమారుడో హీరోలుగా ఉండేవారు. అవి కాకుంటే పౌరాణిక సినిమాలు పెద్ద హిట్ అవుతుండేవి. కానీ 'తోట రాముడు' లాంటి ఒక సామాన్యుడు పెద్ద మాంత్రికుడిని జయించి రాకుమారిని పెళ్లి చేసుకోవడం అనేది అప్పటి యూత్ కి బాగా కిక్ ఇచ్చేన విషయం. దాంతో తోటరాముడు క్యారెక్టర్ని ఓన్ చేసేసుకుని 'పాతాళ భైరవి'కి బ్రహ్మరథం పట్టారు నాటి ప్రేక్షకులు. తోట రాముడి పాత్రలో కనిపించిన ఎన్టీఆర్ అయితే యూత్ ఐకాన్ గా మారిపోయారు. తర్వాత అదే సంస్థ అదే డైరెక్టర్ తో తీసిన 'మాయాబజార్'తో ప్రతి ఇంటా దేవుడు అయిపోయారు. తెలుగు సినిమా చరిత్ర నడకను మార్చిన 'పాతాళ భైరవి' 75 ఏళ్ళు పూర్తి చేసుకోవడం ఒక మంచి జ్ఞాపకం అని చెప్పాలి.
ట్రెండింగ్ వార్తలు























