Telangana CEO Vikas Raj: మే 13న సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు తప్పవు: వికాస్ రాజ్
Telangana Elections 2024: తెలంగాణలో 144 సెక్షన్ అమల్లో ఉందని, గుంపులు గుంపులుగా బయట తిరగొద్దని సీఈవో వికాస్ రాజ్ సూచించారు. పోలింగ్ రోజు మే 13న పెయిడ్ లీవ్ ఇవ్వని సంస్థలపై చర్యలు తప్పవన్నారు.
Telangana loksabha Elections to be held on May 14: హైదరాబాద్: తెలంగాణలో నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం మే 13న లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తోంది. పోలింగ్ రోజున అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు (Paid Leave) ఇవ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు ఉంటాయని తెలంగాణ ఎన్నిల ప్రధానాధికారి వికాస్ రాజ్ (Telangana CEO Vikas Raj) తెలిపారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కొన్ని ఐటీ, ప్రైవేట్ కంపెనీలు సెలవు ఇవ్వలేదని ఈసీకి ఫిర్యాదులు వచ్చాయన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికలు, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల రోజున సెలవులు ఇవ్వని సంస్థలపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో 1.88 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని తెలిపారు. జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉందన్నారు.
48 గంటల పాటు 144 సెక్షన్
శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 13 సాయంత్రం 6 గంటల వరకు 48 గంటలపాటు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు అవుతుందని తెలిపారు. నలుగురి కంటే ఎక్కువ వ్యక్తులు ఒకేసారి కలిసి తిరుగొద్దు అని హెచ్చరించారు. రేపు, ఎల్లుండి పేపర్లలో ప్రకటనల కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. వేరే నియోజకవర్గాల నుంచి వచ్చిన వారు వారి ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోవాలన్నారు. కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్, హోటల్స్ లలో ఉన్న ఇతర జిల్లాల వ్యక్తులు వెళ్లిపోవాలని వికాస్ రాజ్ సూచించారు.