TSRTC Men Special: "పురుషులను గౌరవిద్దాం- వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం"
టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో సీటు రిజర్వేషన్ల స్లోగన్ రివర్స్ కానుంది. పురుషులకు సీట్ రిజర్వేషన్ కల్పించే యోచనలో ఉంది ఆర్టీసీ. ఒక్కో బస్సులో 20 సీట్లు పురుషులకు కేటాయించాలని భావిస్తోంది.
TSRTC seat Reservation for Men: స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం. ఆర్టీసీ బస్సుల్లో కనిపించే స్లోగన్ ఇదే. కానీ... ఇప్పుడు ఆ స్లోగన్ రివర్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత... తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీంతో బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో... బస్సుల్లో పురుషులు కూర్చునేందుకు సీట్లు ఖాళీ ఉండటంలేదు.. వారు నిలబడే ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో పురుషులకు ప్రత్యేకంగా సీట్లు రిజర్వ్ చేయాలనే ఆలోచనలో ఉంది ఆర్టీసీ. ఇదే జరిగితే... పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం.. అనే నినాదం వస్తుందో ఏమో.
ఉచితంతో మొత్తం రివర్స్
ఇది వరకు ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు కేటాయించిన సీట్లలోనూ పురుషులు కూర్చునేవారు. కొంత మంది మహిళలు వచ్చి.. లేడీస్ రిజర్వేషన్ సీటు లేవండి అని చెప్పినా లేచేవారు కాదు... పైగా వాగ్వాదానికి దిగేవారు. రాష్ట్రం ఏదైనా... ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ బస్సుల్లో ఉన్న పరిస్థితి ఇదే. ఇప్పుడు తెలంగాణ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఉచిత ప్రయాణం ఎఫెక్ట్‌తో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో.. పురుషులకు సీట్లు ఖాళీ ఉండని పరిస్థితి నెలకొంది. దీంతో... పురుషుల్లో అసహనం పెరిగిపోతోంది. టికెట్ కొనుక్కుని ప్రయాణిస్తున్న తమకు సీటలు లేకపోతే ఎలా..? అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. బస్సుల్లో వాగ్వాదాలకు దిగుతున్నారు. ఈ పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంటున్నారు టీఎస్‌ఆర్టీసీ అధికారులు. బస్సుల్లో పురుషుల కోసం కొన్ని సీట్లు కేటాయిస్తే ఎలా ఉంటుంది... అన్న ఆలోచన చేస్తున్నారు.
20 సీట్లు పురుషులకు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవణా సంస్థ (TSRTC) లోని ప్రతీ బస్సులో 55 సీట్లు ఉంటాయి. వారిలో 20 సీట్లు పురుషులకు రిజర్వ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. అన్ని డిపోల నుంచి వివరాలు పంపాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. డిపోల వారీగా నివేదికలు వచ్చిన తర్వాత... పురుషులకు ఎన్ని సీట్లు రిజర్వ్ చేయాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. బస్సుల్లో పురుషులకు కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తే... అదో వినూత్న ప్రయత్నమే అవుతుంది. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి విధానం లేదు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్ రిజర్వేషన్ అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కుతుంది. అయితే... ఈ విధానం వల్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందా..? అన్న కోణంలోనూ ఆలోచన చేస్తున్నారు ఉన్నతాధికారులు. ఎందుకంటే దేశంలో ఇప్పటివరకూ మహిళలకే తప్ప పురుషులకు సీట్లు రిజర్వ్ చేసిన దాఖలాలు లేవు. తెలంగాణలో ఈ విధానం ప్రవేశపెడితే.. మేల్ ఇగో దెబ్బతిని వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా..? అనేది కూడా ఆలోచిస్తున్నారు ఆర్టీసీ అధికారులు.
ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు రిజర్వ్ చేసిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కుతుందా...? అదే వ్యతిరేకత మూటగట్టుకుంటుందా..? అన్న కోణంలో యోచనలో చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. అన్ని వివరాలు సేకరించి... అందరి అభిప్రాయాలు తీసుకుని... ఈ విషయంలో ముందడుగు వేయాలని భావిస్తున్నారు. డిపోల వారీగా వచ్చిన సమాచారం ఆధారంగా.. త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. మహాలక్ష్మీ పథకం కింద... మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో... పురుషులకు ప్రత్యేక సీట్ రిజర్వేషన్ అంశంపై కసరత్తు చేస్తోంది టీఎస్‌ఆర్టీసీ.