తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ దూరం? - వీడియో సందేశం వినిపించే ఛాన్స్!
Telangana News: జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ గైర్హాజరవుతారని తెలుస్తోంది. ఆమె ఓ వీడియో సందేశం వినిపిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుుతున్నాయి.
Sonia Gandhi May Not Attended Formation Day Celebrations: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ హాజరు కావడం లేదని తెలుస్తోంది. అయితే, ఆమె హాజరు కాలేకపోయినప్పటికీ వీడియో సందేశం వినిపించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పరేడ్ గ్రౌండ్స్ వేదికపై భారీ ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఆ సందేశాన్ని ప్రజలకు వివరించనున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోనియా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆరోగ్య సమస్యలు, తీవ్ర ఎండలతో వైద్యుల సూచన మేరకు సోనియా గాంధీ తన పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. కాగా, జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే వేడుకలకు.. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా వెళ్లి సోనియాకు ఆహ్వానం అందించారు. ఆమె కూడా సానుకూలంగా స్పందించగా.. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం సోనియా హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా.. చివరి నిమిషంలో పర్యటన రద్దైనట్లు తెలుస్తోంది.
ముమ్మరంగా ఏర్పాట్లు
పదేళ్ల తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖులను ఆహ్వానిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఆదివారం రాజ్ భవన్‌కు వెళ్లి స్వయంగా గవర్నర్ రాధాకృష్ణన్‌ను ఆహ్వానించారు. అటు, మాజీ సీఎం కేసీఆర్ కు సైతం ఆహ్వానం పంపారు. అటు, సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఉదయం, సాయంత్రం ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ప్రత్యేక లాంజ్‌లు సిద్ధం చేశారు. వేడుకల క్రమంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జూన్ 2న ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని.. అలాగే, ట్యాంక్ బండ్ పై 5 వేల మందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని అధికారులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఫైర్ వర్క్స్, కార్నివాల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.