New Traffic Rules: ఈ రోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్, భారీ చలానాలు - ఇష్టం వచ్చినట్లు బండి నడిపితే మీకే నష్టం
Rules of Motor Vehicles Act: ఈ రోజు నుంచి ట్రాఫిక్ రూల్స్ ఇంకా కఠినంగా మారాయి. ముఖ్యంగా, మైనర్ (Minor) అయిన వ్యక్తి బైక్ లేదా కారు వంటివి నడపడంపై నిబంధనలు మరింత కట్టుదిట్టం చేశారు.
New Traffic Rules In India: బైక్ హ్యాండిలో, కారు స్టీరింగో చేతిలో ఉంది కదాని ఇష్టం వచ్చినట్లు బండి నడిపితే మీకే నష్టం. ట్రాఫిక్ పోలీసుల కళ్లలో పడితే బండ బాదుడు బాదుతారు. భారతదేశంలో ఏ వ్యక్తయినా రోడ్డుపై బండి నడపాలనుకుంటే, ముందుగా మోటారు వాహనాల చట్టంలోని రూల్స్ (Rules of Motor Vehicles Act) గురించి తెలుసుకోవాలి, వాటిని కచ్చితంగా పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో జరిమానా (Fine) కట్టాల్సి వస్తుంది. కొన్ని కేసుల్లో జైలు శిక్ష కూడా పడొచ్చు. ఈ రోజు నుంచి (01 జూన్ 2024) భారతదేశ వ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చాయి.
ఈ రోజు నుంచి ట్రాఫిక్ రూల్స్ ఇంకా కఠినంగా మారాయి. ముఖ్యంగా, మైనర్ (Minor) అయిన వ్యక్తి బైక్ లేదా కారు వంటివి నడపడంపై నిబంధనలు మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు, తెలిసి చేసినా/ తెలీక చేసినా... ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది.
మైనర్ వాహనం నడిపితే రూ.25,000 ఫైన్
ఇటీవల, పుణెలో కారు ఢీకొని (Pune car accident case) ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైంది ఖరీదైన పోర్షే కారు. ఆ కారును ఒక బాలుడు (మైనర్) నడుపుతున్నాడు, పైగా అతను మద్యం తాగి కారు నడిపాడు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత, కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మైనర్లు డ్రైవింగ్ చేసే నిబంధనలను కఠినతరం చేసేందుకు నిబంధనలు మార్చింది.
జూన్ 01 నుంచి అమలులోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, మైనర్ (18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలుడు లేదా బాలిక) బైక్ రైడింగ్ లేదా కారు డ్రైవింగ్ చేస్తూ దొరికితే, ఆ మైనర్ తల్లిదండ్రులపై పోలీసులు చర్యలు తీసుకుంటారు. రూ. 25 వేల భారీ జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు... ఆ కారు ఎవరి పేరు మీద ఉంటే అతని డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారు. దొరికిన మైనర్‌కు, మైనారిటీ తీరిన వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయరు. ఆ వ్యక్తికి 25 సంవత్సరాలు నిండిన తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు.
చలాన్ మొత్తం కూడా పెంపు
కొత్త ట్రాఫిక్స్ రూల్స్ ప్రకారం, వివిధ కేసుల్లో చలాన్ (Traffic Challan) మొత్తాన్ని కూడా పెంచారు. ఈ రోజు నుంచి, ఏ వ్యక్తయినా మద్యం తాగి వాహనం నడిపితే రూ. 10,000 జరిమానా కట్టాలి, 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాలి. ఇలాంటి కేసులోనే మరోసారి పట్టుబడితే రూ. 15,000 జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాలి.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ దొరికిపోతే రూ. 5,000 చలాన్ చెల్లించాలి. సిగ్నల్ జంప్ చేస్తే రూ. 1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా కట్టాలి. దీంతోపాటు 6 నెలలు లేదా 1 సంవత్సరం వరకు జైలు శిక్షను అనుభవించాలి.
మరో ఆసక్తికర కథనం: ఈ రోజు బ్యాంక్‌లకు సెలవా, ఈ నెలలో ఎన్ని రోజులు హాలిడేస్?