Sangareddy: ఇనుప మేకులు మింగేసిన ఖైదీ, తప్పించుకొనేందుకు మాస్టర్ ప్లాన్!
ఇనుప మేకులు మింగి నాటకాలాడి ఓ రిమాండ్ ఖైదీని ఆస్పత్రి పాలై పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు పోయాడు.
Sangareddy Inmate Escape: జైలు పాలైన ఖైదీ తప్పించుకొనేందుకు వేసే ఎత్తులు, నటనలు ఎన్నో సినిమాల్లో మనం చూస్తుంటాం. కానీ, నిజ జీవితంలో తప్పించుకుపోవడం అంత సులభం కాదు. కానీ, తాజాగా జరిగిన ఓ ఘటన మాత్రం అచ్చం సినిమాల్లో లాగా ప్లాన్ వేసి ఖైదీ తప్పించుకుపోయాడు. దీంతో అతని ప్లాన్ పై పోలీసులు సైతం అవాక్కవుతున్నారు. తప్పించుకుపోయేందుకు ఏకంగా ఇనుప మేకులు (Iron Screws) మింగి ఆ ఖైదీ ప్రాణాలను సైతం లెక్కచేయకపోవడం విస్మయం కలిగిస్తోంది.
ఇనుప మేకులు మింగి నాటకాలాడి ఓ రిమాండ్ ఖైదీని ఆస్పత్రి పాలై పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు పోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా (Warangal News) రాయపర్తికి చెందిన సీహెచ్ అరవింద్ అనే వ్యక్తి కొన్ని దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతణ్ని కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఈ మధ్య అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా ఖమ్మం జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో (Kukatpally News) జరిగిన ఓ దొంగతనం కేసులో పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి అతణ్ని పోలీసులు సంగారెడ్డి సెంట్రల్ జైలుకు రిమాండ్ కోసం తరలించారు.
అరవింద్ శనివారం జైలులో మేకులు (Iron Screws) మింగడంతో, ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడేమో అని జైలు అధికారులు అతణ్ని హుటాహుటిన చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని (Sangareddy Govt Hospital) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అతనికి మేల్ సర్జికల్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి బాత్ రూంకు వెళ్లి వస్తానని చెప్పిన అరవింద్.. ఎంతసేపటికీ తిరిగి రాలేదు.
పోలీసులు వెళ్లి పరిశీలించగా, బాత్ రూంలో ఉన్న కిటికీ ఊచల్ని తొలగించి అందులోంచి పరారైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. రిమాండ్ ఖైదీలు బాత్‌రూం వెళితే తప్పనిసరిగా చేతులకు గొలుసులు వేయాల్సి ఉంటుంది. అయితే ఏఆర్ పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అరవింద్ పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న అరవింద్‌ను పట్టుకునేందుకు మూడు టీమ్‌లను నియమించినట్లుగా పోలీసులు తెలిపారు. అరవింద్‌పై మొత్తం తొమ్మిది కేసులు ఉన్నాయి.
అయితే, జైలులో మేకులు (Iron Screws) ఎలా దొరికాయి? సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అరవింద్‌కు జైలులో మేకులు ఎలా దొరికాయనేది ప్రశ్నార్థకంగా మారింది. జైలులో ఉండే స్విచ్ బోర్డుకు ఉన్న స్క్రూలను తొలగించి వాటిని మింగినట్లు జైలు అధికారులు చెబుతున్నారు. అరవింద్ కడుపు నొప్పి పుడుతోందని జైలు అధికారులకు చెప్పగా అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఎక్స్‌రే తీయడంతో ఆయన కడుపులో రెండు మేకులు ఉన్నట్లు గుర్తించారు. అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సెంట్రీ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అరవింద్ తప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.