Telangana districts division: రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో జిల్లాల పునర్విభజన కమిటీ - శాస్త్రీయంగా ఎలా చేయాలో చేసి చూపిస్తాం - సీఎం రేవంత్ సంచలన ప్రకటన
Revanth Reddy: జిల్లాల విభజన విషయంలో వస్తున్న రాజకీయ విమర్శలపై రేవంత్ రెడ్డి స్పందించారు. అత్యున్నత కమిటీ వేసి శాస్త్రీయంగా జిల్లాల విభజన చేస్తామన్నారు.

Revanth Reddy On division of districts: జిల్లాల పునర్వ్యస్థీకరణపై రిటైర్డ్ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కనీసం ఆరు నెలల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని కోరుతామని.. వాటి ఆధారంగానే మరోసారి జిల్లాలను శాస్త్రీయ విభజన చేస్తామన్నారు. గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగిందన్నారు. ఐదు మండలలాలో ఓ జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. సికింద్రాబాద్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసిందెక్కడ.. తీసేసిందెక్కడ అని రేవంత్ ప్రశ్నించారు. సికింద్రాబాద్ గ్రేటర్ లో భాగంగానే ఉందని గుర్తు చేశారు. రాచరికాన్ని పోలి ఉందని.. ఒక్క రాచకొండను మాత్రమే మార్చామన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ& క్యాలెండర్ ను ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు.
గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం, కేవలం ఐదు మండలాలను కలిపి కూడా కొన్ని జిల్లాలను ఏర్పాటు చేసిందని, దీనివల్ల పాలనలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజల సౌలభ్యం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ మరోసారి జరగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాల పేర్లు , పరిధిపై గతంలో జరిగిన కొన్ని మార్పులను ముఖ్యమంత్రి తప్పుబట్టారు. ముఖ్యంగా సికింద్రాబాద్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు , తొలగింపు వ్యవహారాలపై ఆయన ప్రశ్నలు సంధించారు. సికింద్రాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగంగానే ఉందని గుర్తు చేశారు. పాలనలో కొన్ని పేర్లు రాచరికాన్ని పోలి ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తాము రాచకొండ పోలీస్ కమిషనరేట్ పేరును మార్చామన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది కేవలం సరిహద్దుల మార్పు మాత్రమే కాదని, అది ప్రజలకు పాలనను దగ్గర చేసే ప్రక్రియగా ఉండాలన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చినప్పుడు తీవ్ర వివాదాలు చెలరేగాయి. జనగామ, మహబూబాబాద్, గద్వాల వంటి ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కొన్ని మండలాలు తమకు సమీపంలో ఉన్న జిల్లా కేంద్రాల్లో కలపాలని కోరినప్పటికీ, ప్రభుత్వం తమ ఇష్టానుసారం విభజించిందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రెవెన్యూ డివిజన్లు, పోలీస్ సర్కిళ్ల పరిధి పరస్పరం పొంతన లేకుండా ఉండటంతో అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ వివాదాలన్నింటినీ కమిటీ ద్వారా పరిష్కరించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
ప్రస్తుత ప్రకటనతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య తగ్గుతుందా లేక పెరుగుతుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రభుత్వం మాత్రం సంఖ్య కంటే శాస్త్రీయత కే ప్రాధాన్యత ఇస్తామని చెబుతోంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే మండలాలు, జిల్లాల సరిహద్దుల మార్పుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో రాజకీయ జోక్యం లేకుండా చూస్తామని, ప్రజల అభిప్రాయాలకు విలువ ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా యంత్రాంగంలో పెను మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది. అయితే సెంటిమెంట్ రాజకీయాలు మాత్రం ఓ రేంజ్ లో జరిగే అవకాశం ఉంది. కమిటీ నియామకం తర్వాత అసలు రాజకీయాలు ప్రారంభం కానున్నాయి.





















