Harish Rao reaction: ఏపీకి సహకిరంచేందుకే నల్లమల సాగర్‌పై చెల్లని రిట్ పిటిషన్ వేశారు - ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం
Nallamala Sagar: సివిల్ సూట్ ఫైల్ చేసుకోవాలని సుప్రీంకోర్టు నల్లమల సాగర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. విచారణకు అర్హత లేని రిట్ పిటిషన్ వేసి ఏకి సహకరించారని హరీష్ రావు ఆరోపించారు.

Harish Rao criticizes Telangana Governament: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీరును హరీష్ రావు మరోసారి తీవ్రంగా తప్పు పట్టారు. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అనుసరిస్తున్న తీరు తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారిందన్నారు. విచారణకు అర్హత లేని రిట్ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఏపీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ఒకవైపు ఏపీ ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తుంటే, ఇక్కడ చేతగానితనాన్ని ప్రదర్శిస్తూ తెలంగాణకు ఈ ప్రభుత్వం చారిత్రక ద్రోహం చేస్తోందని, సుప్రీంకోర్టు సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు స్వరూపం బయటపడిందని ఆయన మండిపడ్డారు.
ఢిల్లీలో న్యాయవాదులు, మంత్రులు ఉన్నప్పటికీ ఇంత బలహీనమైన పిటిషన్ వేయడం వెనుక రహస్య ఒప్పందాలు ఉన్నాయని హరీశ్ రావు అనుమానం వ్యక్తం చేశారు. రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుని సివిల్ సూట్ వేస్తామని ప్రభుత్వం చెప్పడం అంటే, ఏపీకి ప్రాజెక్టు పూర్తి చేసుకోవడానికి గడువు ఇవ్వడమేనని ఆయన విమర్శించారు. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలను ఈ వివాదంలోకి లాగడం వల్ల విచారణ ఏళ్ల తరబడి సాగుతుందని, ఈలోగా ఏపీ ప్రభుత్వం పనులు పూర్తి చేసి గోదావరి జలాలను తరలించుకుపోతుంటే మన ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు నాయుడికి సంక్రాంతి కానుకగా ఈ ప్రాజెక్టును అప్పగిస్తున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. గతంలో బనకచర్ల విషయంలో అభ్యంతరాలు లేవంటూ సంతకం పెట్టినప్పుడే ఈ జల దోపిడీకి పునాది పడిందని, ఇప్పుడు న్యాయస్థానంలో పస లేని వాదనలు వినిపిస్తూ తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాస్తున్నారని ఆరోపించారు. పంచాయితీలు వద్దు, కూర్చుని చర్చించుకుందాం అన్న రేవంత్ రెడ్డి మాటల పరమార్థం తెలంగాణ నీటి వాటాను ఏపీకి గంపగుత్తగా అప్పచెప్పడమేనని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో దోస్తీ కట్టి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదని హరీశ్ రావు హెచ్చరించారు. గురుదక్షిణ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోబోమని, బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఈ దుర్మార్గాన్ని ఎండగడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని పటిష్టమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ?
రాష్ట్రాల మధ్య జల వివాదాలు తలెత్తినప్పుడు నేరుగా రిట్ పిటిషన్ దాఖలు చేయడం కంటే ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ ఫైల్ చేయడం సరైన మార్గమని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రాజెక్టు ఇంకా ప్లానింగ్ దశలోనే ఉన్నందున, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉందా అని న్యాయస్థానం ఇరు రాష్ట్రాలను ప్రశ్నించింది. ప్రస్తుతానికి స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ అంశంపై చర్చలు జరపవచ్చని సూచించింది. దీంతో రిట్ పిటిషన్‌ను తెలంగాణ వెనక్కి తీసుకుంది. రెండు రోజుల్లో సివిల్ సూట్ ఫైల్ చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.





















