Union Cabinet: బీజేపీ నాయకత్వంతో పాటు కేంద్ర కేబినెట్ రూపు రేఖల మార్పు - మోదీ, అమిత్ షా లిస్ట్ ఫైనల్ చేశారా?
BJP leadership: బీజేపీ పార్టీతో పాటు కేంద్ర కేబినెట్ కు కొత్త జవసత్వాలు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో అటు పార్టీతో పాటు ఇటు కేబినెట్ లోనూ కీలక మార్పులు చేయనున్నారు.

Union Cabinet Changes: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్‌కు చెందిన సీనియర్ నేత, ప్రస్తుతం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నితిన్ నబిన్ ఎన్నిక దాదాపు ఖరారైంది. మరో నెల రోజుల్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. 45 ఏళ్ల నితిన్ నబిన్ బిజెపి చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుడిగా రికార్డు సృష్టించబోతున్నారు. 2020 నుంచి అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని మోదీ, ఇతర అగ్రనేతలతో కూడిన పార్టీ జాతీయ కౌన్సిల్ త్వరలో ఈ నియామకానికి ఆమోదముద్ర వేయనుంది.
ఈ నెలలోనే కీలక నియామకాలు
నితిన్ నబిన్ సారథ్యంలో రాబోయే కొత్త టీమ్ పూర్తిగా సమ్మిళితం గా ఉండబోతోంది. ముఖ్యంగా బిజెపికి మార్గదర్శక సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ తో సమన్వయాన్ని పెంచేలా ఈ కమిటీ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత మూడు నాలుగు దశాబ్దాలుగా సంఘ్ పరివార్ కోసం అంకితభావంతో పనిచేసి, ఇప్పటివరకు పదవులు పొందని సీనియర్ నేతలకు ఈసారి కొత్త టీమ్‌లో లేదా ప్రభుత్వ సంస్థల్లో కీలక బాధ్యతలు దక్కనున్నాయి. మకర సంక్రాంతి తర్వాత, బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ కీలక నియామకాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కేంద్ర మంత్రివర్గంలో యువనేతలకు చోటు ఇచ్చే అవకాశం
పార్టీ సంస్థాగత మార్పులతో పాటు కేంద్ర మంత్రివర్గంలో కూడా భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 2024 జూన్‌లో మూడవసారి మోదీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇప్పటివరకు క్యాబినెట్‌లో మార్పులు జరగలేదు. ఇప్పుడు పార్టీ బాధ్యతల నుంచి తప్పుకునే కొందరు సీనియర్లను మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదా మంత్రులను పార్టీ బాధ్యతల్లోకి పంపడం వంటివి జరగవచ్చు. ముఖ్యంగా యువ నాయకత్వానికి, రెండో శ్రేణి నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు జాట్ వంటి సామాజిక వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించే దిశగా హైకమాండ్ ఆలోచిస్తోంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా నిర్ణయాలు
ముందున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం వంటి రాష్ట్రాల నుంచి కీలక నేతలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది. కేంద్ర ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం సాధించడం నితిన్ నబిన్ ముందున్న ప్రధాన లక్ష్యం. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ భావిస్తోంది. ఈ మార్పుల ద్వారా 2029 సార్వత్రిక ఎన్నికలకు బలమైన పునాది వేయాలని బిజెపి వ్యూహరచన చేస్తోంది.





















