WEATHER REPORT: అలర్ట్.. అలర్ట్.. మరో మూడు రోజులు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. తెలంగాణలో మరో మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశాలున్నాయని పేర్కొంది. గాలులు పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి వీస్తున్నాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 28న ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
పలు జిల్లాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వరద నీరు చేరడంతో పలు ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లో మాత్రం వరుణుడు కాస్త శాంతించనున్నట్లు కనిపిస్తున్నాడు.
నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి పరివాహక ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రచాలం వద్ద గోదావరి నీటిమట్టం 48.30 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు చేరింది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈనెల 22న రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 9 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్టు నుంచి ఏకంగా 6 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదలాల్సి వచ్చినట్లు అధికారులు చెప్పారు. జూన్ 1న ప్రాజెక్టులో కేవలం 18 టీఎంసీల నీరు ఉండగా.. జులై 1నాటికి అది 27 టీఎంసీలకు చేరింది. జులై 16న ఒక్కరోజే 10టీఎంసీల నీరు రాగా.. 21న సైతం 10టీఎంసీలు చేరింది. ఇక జులై 22న ప్రాజెక్టు పూర్తిగా నిండిపోగా.. ఆరోజు మధ్యాహ్నం గేట్లు ఎత్తి శనివారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 45.3 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు.
మరోవైపు కృష్ణా, గోదావరి నదుల్లో పెరుగుతున్న నీటి మట్టం కారణంగా మిగులు జలాలు సముద్రంలోకి వదులుతున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.