Huzurabad BSP : హుజురాబాద్ బరిలో బీఎస్పీ ప్రవీణ్ కుమార్..!?
ఐపీఎస్‌కు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్ కుమార్ హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీ చేయాలని ఆయనపై బీఎస్పీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు.
హుజురాబాద్ ఉపఎన్నికలో మరో కీలకమైన అభ్యర్థి బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఐపీఎస్‌కు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగవచ్చన్న ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల కిందట ఆయన బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. ఏనుగెక్కి ప్రగతి భవన్‌కు వస్తామని చాలెంజ్ చేశారు. బీఎస్పీ చిహ్నం ఏనుగు. ఆ తర్వాత ఆయన జిల్లాలు పర్యటిస్తున్నారు. బీఎస్పీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పలువురు నేతలు బీఎస్పీలో చేరేందుకు ఆసక్తి చూపించారు. వారందరిని బీఎస్పీలో చేర్చుకునేందుకు 26వ తేదీన బహిరంగసభను ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రవీణ్ కుమార్ పోటీపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు.
బహుజన సమాజ్ పార్టీకి తెలంగాణలో పెద్దగా క్యాడర్ లేదు. కానీ కొంత మంది నేతలు ఉన్నారు. ఇప్పుడు ప్రవీణ్ కుమారే బీఎస్పీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయనను ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటి వరకూ ఉన్న బీఎస్పీ నేతలు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ ఆషామాషీగా రాజకీయాల్లోకి రాలేదు. ఆయనకు అండగా స్వేరో సంస్థ ఉంది. ఆ సంస్థకు పెద్ద ఎత్తున సభ్యులు ఉన్నారు. వారు ప్రవీణ్ కోసం పని చేసే అవకాశం ఉంది. ఈ బలంపై నమ్మకంతోనే ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చారన్న అభిప్రాయం కూడా ఉంది.
ప్రవీణ్ కుమార్ రాజకీయంగానూ కీలకమైన అడుగులు వేస్తున్నారు. దళిత వాదాన్ని జోరుగా వినిపిస్తున్న ఆయన ఆ ఒక్క వర్గంతోనే ముందుకెళ్లడం కష్టమనుకుని ఇప్పుడు బీసీ వాదం కూడా వినిపిస్తున్నాయి. జిల్లాల వారీగా బీసీల సభలు పెడుతున్నారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో దళితులు.. బీసీలంతా ఐక్యంగా ఉద్యమించి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ బీసీ గణనకు భారత ప్రభుత్వం ఒప్పుకోవట్లేదని, 2014లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సకల జనుల వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. కేవలం దళిత వర్గాలనే కాకుండా బీసీలను కూడా ఆకట్టుకుంటే బీఎస్పీ బలోపేతం అవుతుందని ఆయన అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
హుజూరాబాద్‌లో పోరాటం ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా నడుస్తోందని అక్కడ పార్టీలకు ప్రాధాన్యం లేదన్న అభిప్రాయం కూడా కొంత మంది బీఎస్పీ నేతల్లో వ్యక్తమవుతోంది. అందుకే ఉపఎన్నికల్లో పోటీ చేయకపోతే మంచిదని అంటున్నారు. అయితే అక్కడ దళితుల ఓట్లు ఎక్కువగా ఉండటంతో గట్టి పోటీ ఇచ్చినా బీఎస్పీ ముద్ర తెలంగాణ రాజకీయాలపై గట్టిగా పడుతుందని.. ఆ ప్రయత్నం చేయవచ్చన్న అభిప్రాయం కూడా ఆ పార్టీలో వినిపిస్తోంది. ప్రవీణ్ కుమార్ పోటీపై 26వ తేదీన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.