Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్- కొత్త రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై కీలక ప్రకటన
Ration Cards in Telangana | రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 26 నుంచి అమలు చేస్తామని కీలక ప్రకటన చేశారు.

Telangana Schemes | హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. గత కొన్ని నెలలుగా కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం గ్రౌండ్ వర్క్ చేసింది. అదే విధంగా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనవరి 26 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు
రేషన్ కార్డు జారీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికపై అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఇంఛార్జ్ మంత్రులు ఇదివరకే సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి తరువాత ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీల మధ్య లబ్ధిదారులకు సంబంధించి ప్రాథమికంగా వారి వివరాలు పరిశీలించనుంది ప్రభుత్వం. జనవరి 20 నుంచి 24 తేదీలలో వార్డుల వారీగా ప్రజాభిప్రాయం సేకరించనున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. అనంతరం జనవరి 21 నుంచి 25 తేదీలలో లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి డేటా ఎంట్రీ పూర్తి చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగానే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
కొత్త రేషన్ కార్డుల జారీ
హైదరాబాద్ సిటీలో స్థలం ఉన్నా, సొంతిల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తాం. రాజకీయాలకు అతీతంగా అర్హులైన లబ్దిదారులు అందరికీ ఇండ్లు మంజూరు చేసి దేశంంలోనే ఆదర్శంగా నిలుస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇచ్చిన నిరుపేదలకు అండగా నిలుస్తుంది మా ప్రభుత్వం. లాటరీ పద్ధతిలో దశల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం. రేషన్ కార్డులు సైతం జారీ చేయాలని, పాత కార్డుల్లో మార్పులు చేర్పులకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 26నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ చేయనున్నాం. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుకు వేసే ప్రసక్తే లేదు - పొన్నం ప్రభాకర్






















