Ponnala Meet KCR: సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి పొన్నాల భేటీ - కేటీఆర్ ఆహ్వానం మేరకు కీలక సమావేశం
సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి, తెలంగాణ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేయగా, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి, తెలంగాణ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆదివారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు వచ్చిన పొన్నాల దంపతులను సీఎం సాదరంగా ఆహ్వానించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొన్నాల, కేసీఆర్ కీలక విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కె.కేశవరాావు, దాసోజు శ్రవణ్ సైతం పాల్గొన్నారు. కాగా, తనకు కాంగ్రెస్ లో అవమానం జరిగిందని ఇటీవలే పొన్నాల ఆ పార్టీకి రాజీనామా చేశారు.
కేటీఆర్ ఆహ్వానం
కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసిన అనంతరం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ఆయన ఇంటికి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించగా పొన్నాల సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. సోమవారం జనగామ సభలో పొన్నాల గులాబీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయి.
పొన్నాల ఏం అన్నారంటే.?
పార్టీలో తనకు తగిన గౌరవం దక్కలేదని పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని అమ్మకానికి పెట్టి ఓ వ్యాపార వస్తువులా మార్చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ లో బీసీలకు అవమానం జరుగుతోందని, వాటిని తట్టుకోలేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. '45 ఏళ్ల రాజకీయ జీవితం నాది. పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి చేరుకున్నా. పార్టీలో అవమానం భరించలేకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.' అని పేర్కొన్నారు.
ఘాటు వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో పొన్నాల కీలక వ్యాఖ్యలు చేశారు. తన లాంటి సీనియర్ నాయకుడికి పార్టీ సీనియర్ల అపాయింట్ మెంట్ కూడా నెలల తరబడి దొరకడం లేదని ఆవేదన చెందారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. 2014లో కాంగ్రెస్ ఓటమితి తనను బలి పశువును చేశారన్న పొన్నాల, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ బలపడకపోయినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని గుర్తు చేశారు. ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా తాను పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉన్నానని పొన్నాల స్పష్టం చేశారు.
రేవంత్ తీవ్ర ఆగ్రహం
కాగా, కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేయడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. '40 ఏళ్లు పార్టీలో ఉండి, కీలక పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారడానికి సిగ్గుండాలి' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'పీసీసీగా ఉండి 40 వేల ఓట్లతో ఓడిపోయారు. రెండోసారి 50 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. పార్టీని దెబ్బ తీయడానికి, వీక్ చేయడానికి పొన్నాల ఈ నిర్ణయం తీసుకున్నారు.' అంటూ రేవంత్ ధ్వజమెత్తారు.