Crime News: ఎమ్మెల్యే ఇంట్లోనే పీఏ అనుమానాస్పద మృతి - ఆత్మహత్య కాదంటున్న బంధువులు - అసలేం జరిగింది?
Telangana News: ఆలేరు ఎమ్మెల్యే ఇంట్లో పీఏ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆతను ఆత్మహత్య చేసుకున్నాడా మరో కారణమా అన్నది పోస్టుమార్టంలో తేలనుంది.

PA commits suicide at Aler MLA House: ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంటిలోని పెంట్ హౌస్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎమ్మెల్యే వద్ద కొంత కాలంగా పని చేస్తున్నాడు. ఇంట్లోని పెంట్ హౌస్‌లోనే తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన భార్య కూడా ఎమ్మెల్యే ఇంట్లోనే పని చేస్తుంది. బీర్ల ఐలయ్య ఇల్లు యాదగిరిగుట్ట ఉంటుంది. రవి, తన భార్యతో కలిసి ఎమ్మెల్యే ఇంట్లో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. రవి మరణం వెనుక ఉన్న పరిస్థితులను లోతుగా విచారిస్తున్నారు. ఎమ్మెల్యే నివాసంలో ఈ అనుమానాస్పద మరణం స్థానికంగా సంచలనం సృష్టించింది, రాజకీయ మరియు సామాజిక వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
బీర్ల ఐలయ్య పీఏ గంథమల్ల రవి సైదాపురం గ్రామ వాసి. ఆయన రెండు రోజుల కిందట గ్రామానికి వెళ్లి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. రవికి ఎలాంటి సమస్యలులేవని.. ఆత్మహత్య చేసుకునే పని అయితే.. గ్రామానికి వచ్చినప్పుడు కాకుండా తిరిగి వెళ్లి ఎమ్మెల్యే ఇంట్లో ఎందుకు చేసకుంటాడని బంధువులు ప్రశ్నిస్తున్నారు. తన పీఏ అనుమానాస్పద స్థితిలో చనిపోవడంపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంకా స్పందించలేదు. ఎమ్మెల్యే ఐలయ్య ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. రవి మృతదేహానికి నివాళి అర్పించారు.
గంథమల్ల రవికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే ఇంటిని పోలీసులు పరిశీలించారు. పోస్ట్‌మార్టం నివేదిక, దర్యాప్తు పూర్తయిన తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఆయన ఫోన్ రికార్డులతో పాటు ఆస్తి వివాదాలు, పార్టీ వ్యవహారాల్లో ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా అన్న దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. ఎమ్మెల్యే వెంట ఉండే మనిషి కావడంతో ఇతర అనుచరులతో ఏమైనా వివాదాలు తలెత్తాయా అన్న దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని బంధువులతో పాటు.. ఇతర పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.





















