KTR vs Congress: కేటీఆర్‌పై కేసు నమోదు- భగ్గుమంటున్న బీఆర్‌ఎస్
KTR vs Congress:

KTR vs Congress: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మరో కేసు నమోదు అయింది. సీఎంను అసభ్యకరమైన వ్యాఖ్యలతో కించపరిచారనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడుతున్నారు.
కాళేశ్వరం కమిషన్ ముందుకు విచారణకు ఈ నెల 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు బీఆర్కే భవన్‌కు వచ్చిన కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై పరుషపదజాలంతో విమర్శలు చేశారు. కేసీఆర్ వెంట్రుక కూడా ఈ చిల్లరగాళ్లు పీకలేరంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరుస్తూ మాట్లాడటమే కాకుండా వివిధ వర్గాలను రెచ్చగొట్టేలా చేశారని తన ఫిర్యాదులో వెంకట్ పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని వెంకట్ ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోలను చూసిన పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ఫైల్ చేశారు. ఈ కేసులో నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
కేటీఆర్ ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడొచ్చు
Live: బీఆర్కేఆర్ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS https://t.co/FZtw8emt04
— BRS Party (@BRSparty) June 11, 2025
ఇప్పటికే వెంటాడుతున్న ఫార్ములా ఈ కార్ రేసు కేసు
కేసీఆర్ ఫార్ములా–ఈ కార్ రేస్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఒకసారి అధికారులు పిలిచి ప్రశ్నించారు. ఇప్పుడు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. సోమవారం ఉదయం 10గంటలకు ఏసీబీ ఆఫీస్‌లో విచారించనున్నారు. కేటీఆర్ ఈ కేసులో A1గా ఉన్నారు. మే నెలలోనే విచారణ జరగాల్సి ఉంది. కానీ అప్పుడు కేటీఆర్ విదేశాల్లో ఉన్నందున విచారణకు రావడానికి వీలుకాదని చెప్పారు. దీంతో ఇప్పుడు మళ్లీ నోటీసులు జారీ చేశారు.
ఇలా కేసుల మీద కేసులు పెడుతుండటంపై బీఆర్‌ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. కక్ష సాధింపులకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రశ్నించే గొంతుకలను ఇలా తొక్కిపెట్టాలని చూస్తోందని విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో శ్రేణులపై కేసులు పెట్టి హింసించిన ప్రభుత్వం ఇప్పుడు అగ్రనాయకులను టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు నేతలు.





















