KTR : జడ్జి సమక్షంలో లై డిటెక్టర్ టెస్టు - ప్రత్యక్ష ప్రసారం కూడా - రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Telangana: లై డిటెక్టర్ టెస్టు చేయించుకుందామని సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్ చేశారు. ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ఈ సవాల్ చేశారు.

KTR challenges CM Revanth to take a lie detector test: ఫార్ములా ఈ రేసు కేసులో తనకు నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ మండిపడ్డారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. ఈ చిల్లర చేష్టలు, పనికిరాని డ్రామాలతో ప్రతినిత్యం తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకోలేరని ఈ దద్దమ్మ సీఎం, ఈ వైఫల్యాల కాంగ్రెస్ సర్కారు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.
ఏసీబీ విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తా !
ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, బ్యాంకు ద్వారా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్ లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు పంపాడనన్నారు. చట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవడంతోపాటు.. విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానని ప్రకటించారు.
లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా ?
పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్ లో ఉందిఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి గారి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉన్నదా అని ప్రశ్నించారు. లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్దం, నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డి అని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా సూటిగా ప్రశ్నిస్తున్నానన్నారు. దివాళాకోరు విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఓ ముఖ్యమంత్రిగా నిస్సిగ్గుగా మీ అసమర్థతను చాటుకుంటున్న ఈ తరుణంలో విచారణల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకుని, వెంటనే లై డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు.. రోజుకో కుట్ర చేస్తున్నాడు..
— KTR (@KTRBRS) June 13, 2025
కానీ ఈ చిల్లర చేష్టలు, పనికిరాని డ్రామాలతో ప్రతినిత్యం తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకోలేరని ఈ దద్దమ్మ…
నోటీసుల్ని ఖండించిన హరీష్ రావు
తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు అనడానికి కే టీ ఆర్ కు ఇచ్చిన తాజా నోటీసులే నిదర్శనమని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని నిరంతరం ప్రశ్నిస్తున్న కే టీ ఆర్ నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి ఈ నోటీసులు పంపించారన్నారు. మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధించే తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు.





















