Nizamabad News: ఎల్లారెడ్డిలో ఆధిపత్య పోరు- కాంగ్రెస్ టికెట్ కోసం ముగ్గురు పోటీ
తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో జిల్లా పార్టీలోనూ అలాంటి సమస్యలే కనిపిస్తున్నాయి. నేతల మధ్య సఖ్యత లేని కారణంగా మరిన్ని ఇబ్బందుల్లోకి వెళ్లిపోతోంది.
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో వర్గ పోరు తీవ్రమైంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంపై కన్నేసిన మదన్ మోహన్ రావు, సుభాష్ రెడ్డి ఒకరితో మరొకరికి పొసగడం లేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభతో వీరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఈ సభ వీళ్లిద్దరి బలప్రదర్శనకు వేదికగా మారింది.
కామారెడ్డి జిల్లా 4 అసెంబ్లీ నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. 2019వ సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మదన్ మోహన్ రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో స్పల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్న నాయకులు తన ఓటమికి కారణమని మదన్ మోహన్ రావులో అసంతృప్తి మొదలైంది. ఇంకొవైపు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన జాజుల సురేంధర్ టిఆర్ఏస్ లో చేరారు. దీంతో ఎంపీగా ఓటమిపాలైన మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు.
మదన్ మోహన్ రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు కావడంతో ఎర్రబెల్లి ఆశీస్సులు కూడా ఉన్నాయి. ప్రస్తుత టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్రెడ్డితో ఎర్రబెల్లితో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే బరిలో ఉండేందుకు మదన్ మోహన్ రావు ప్రిపేర్ అవుతున్నారు.
ఎల్లారెడ్డి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఆరు నెలలుగా ఈ ఇద్దరు నేతలు పోటాపోటీ కార్యక్రమాలు చేస్తుండటంతో వర్గపోరు స్టార్ట్ అయ్యింది.
ఫ్లెక్సీల రగడ
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ సభ నాయకుల ఫ్లెక్సీల రగడ తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావు సభ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీంతో ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకుడు సుభాష్‌రెడ్డి వర్గీయులు తొలగించారని మదన్ మోహన్ రావు వర్గీయులు ఆరోపించారు. ఇరువర్గాల కార్యకర్తలను టిపిసిసి నేత షబ్బీర్ అలీ సముదాయించారు. సభ అనంతరం మీటింగ్ లో ఫ్లెక్సీ వివాదాన్ని పరిష్కరిస్తామని షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నాయకుల మధ్య తాత్కాలికంగా బ్రేక్ పడింది.
మాజీ ఎమ్మెల్యే సభకు దూరం
మాజీ ఎంపీ బాలాగౌడ్ బంధువు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత బి. జనార్ధన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సభకు దూరంగా ఉన్నారు. వలస వచ్చిన నేతలతో కాంగ్రెస్ పార్టీ వర్గపోరుతో బజారున పడిందని మాజీ ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో బి.జనార్ధన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999,2009లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినా.... ప్రజాదరణ ఉన్న నేతగా ఆయన గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో మంచిపేరుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. టిడిపి నుంచి వచ్చిన సుభాష్ రెడ్డి, టిడిపి మాజీ మంత్రి అల్లుడు మదన్మోహన్ రావులు పార్టీలో చేరడంతో వర్గపోరు తారాస్థాయికి చేరిందని అభిప్రాయంతో దూరమవుతున్నారు. 2018లో పార్టీ టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ఆయన కృషి చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎల్లారెడ్డి టికెట్ ఆశించడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి.