(Source: ECI/ABP News/ABP Majha)
Corona Virus In Nizamabad: నిజామాబాద్‌లో గుబులు రేపుతున్న కరోనా- ఒక్కరోజే 29 పాజిటివ్ కేసులు
కొడిచర్ల గ్రామంలోని ప్రభుత్వ విద్యార్థుల గురించి కలెక్టర్ ఆరా తీశారు. అందరికి టెస్టులు చేశామని, పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో మళ్ళీ కరోనా గుబులు పుట్టిస్తోంది. రోజు రోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకి కరోనా జిల్లాలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 29 కేసులు నమోదు కావటం ఆందోళనకు గురిచేస్తోంది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కోడిచర్ల గ్రామంలోని ప్రైమరీ స్కూల్‌లో పని చేస్తున్న టీచర్లలో ఒకరికి కరోనా సోకింది. దీంతో పాఠశాలలోని అందరికీ పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో 101 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది.
పెరుగుతున్న కేసులు
రెండ్రోజుల క్రితం తెలంగాణ యూనివర్సిటీలో 17 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చిoది. ఇలా విద్యా లయాల్లో కరోనా పాజిటివ్ కేసులో నమోదు కావటం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వారం రోజుల్లో 86 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాక్సినేషన్ ఇస్తున్నారు. లక్షణాలు ఉన్నవారు కరోనా టెస్టులు చేసుకోవాలని జిల్లా వైద్య శాఖ సూచిస్తోంది. వ్యాక్సినేషన్ అన్ని పీహెచ్‌సీ సెంటర్ల అందుబాటులో ఉంచారు. ప్రజలు తప్పని సరిగా మాస్కులు ధరించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గుంపులు గుంపులుగా ఉన్న చోటికి వెళ్ళొద్దని చెబుతున్నారు.
కలెక్టర్ రివ్యూ
కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను విరివిగా చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లు తీసుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో కోవిడ్ నియంత్రణ, సీజనల్ వ్యాధుల నిర్మూలన, హరితహారం, సంక్షేమ వసతి గృహాల మరమ్మతులు తదితర అంశాలపై సమీక్ష జరిపారు.
వేగంగా వ్యాక్సినేషన్
కరోనా కేసులు మళ్లీ స్వల్ప మోతాదులో పెరుగుతున్నందున కోవిడ్ పరీక్షలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పరిస్థితి అదుపు తప్పకుండా అంతటా అప్రమత్తంగా వ్యవహరించాలని హితవు పలికారు. పన్నెండు సంవత్సరాలు పైబడిన వయస్సు గల విద్యార్థిని, విద్యార్థులకు పూర్తి లక్ష్యం మేరకు వ్యాక్సిన్లు అందించాలని, సోమవారం నుంచి అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రాధాన్యత అంశంగా భావిస్తూ చేపట్టాలని ఆదేశించారు. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని పూర్తి స్థాయిలో లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని, పైపైన పని చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
సమీక్ష సందర్భంగా కొడిచర్ల గ్రామంలోని ప్రభుత్వ విద్యార్థుల గురించి ఆరా తీశారు. అందరికి టెస్టులు చేశామని, పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, కరోనా సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి తగిన చికిత్సలు చేయాలని, పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని సూచించారు.
సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను పకడ్బందీగా జరిగేలా చూడాలని, ప్రతి మండలంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, మండల వైద్యాధికారి రోజులు రెండు గ్రామాలను సందర్శించి సర్వే తీరును నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ పట్టణాల్లో కమిషనర్లు, మెప్మా కో ఆర్డినేటర్లు పర్యవేక్షించాలన్నారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా దోమ తెరలు వాడేలా అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. హరితహారం ప్రగతిని సమీక్షిస్తూ, వచ్చే వారం రోజుల్లోపు నిర్దేశించిన లక్ష్యంలో 80 శాతం వరకు మొక్కలు నాటేలా అన్ని శాఖల అధికారులు చొరవ చూపాలన్నారు. పక్షం రోజుల అనంతరం జిల్లాలో ఎక్కడ చూసినా ప్రతి ఒక మీటరు దూరానికి ఒక మొక్క తప్పనిసరిగా కనిపించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రధానంగా రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను గుర్తిస్తూ, వరుస క్రమంలో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, రైతు వేదికలు, విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న మొక్కలు, ట్రీ గార్డులను సరి చేసుకోవాలని, మొక్కల సంరక్షణ చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.