Basar IIIT: గవర్నర్ వద్దకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, సమస్యలపై ఫిర్యాదు
ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జూలైలో విద్యార్థులు ఏడు రోజులపాటు శాంతియుత నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పంచాయితీ గవర్నర్ తమిళసై వద్దకు వెళ్లింది. బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విద్యార్థులు గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వం దృష్టికి ఎన్ని సార్లు తమ సమస్యలను తీసుకెళ్లినా పెడచెవిన పెడుతోందని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గవర్నర్ కు వివరించారు.
ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జూలైలో విద్యార్థులు ఏడు రోజులపాటు శాంతియుత నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఐటీలో కనీస మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి ఉంది. మరుగుదొడ్లు, మెస్, బెడ్స్ లేకపోవటం, ఫ్యాన్స్ కూడా లేని పరిస్థితి, శాశ్వత వీసీ నియామకం లేకపోవటం ఇలా 12 డిమాండ్లపై ట్రిపుల్ ఐటీ విద్యార్థులు 7 రోజుల పాటు నిద్రహారాలు మాని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో విద్యార్థి లోకం నిరసనలు చేపట్టింది. వీరికి విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు మద్దతు కూడా తెలిపారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులు పెట్టిన 12 డిమాండ్లను ఒప్పుకుని విడతల వారిగా అన్ని పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు. మంత్రి హామీ ఇచ్చినా ట్రిపుల్ ఐటీలో సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే బాసర ట్రిపుల్ ఐటీలో దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి ఆస్పత్రుల పాలయ్యారు. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మంత్రి వచ్చి వెళ్లినా ఏ మాత్రం మార్పు రాలేదని ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ తో ప్రాణాపాయ స్థితి నుంచి స్టూడెంట్స్ తప్పించుకున్నారు. అయినా మెస్ లో ఏ మాత్రం మార్పు రావటం లేదని విద్యార్థులు అంటున్నారు. ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి కూడా చనిపోయారన్న వార్తలు విద్యార్థి లోకాన్ని మరింత కలిచివేసింది. ఫుడ్ పాయిజన్ అయినా గాని మెస్ లలో అదే పరిస్థితి కొనసాగిస్తున్నారని.. తిరిగి కుళ్లిపోయిన పదార్థాలే పెడుతున్నారని విద్యార్థులు మరో దఫా ఆందోళనకు దిగారు.
రాత్రి భోజనం చేయకుండా తిరిగి ఉదయం అల్పహారం చేయకుండా మధ్యాహ్నం వరకూ విద్యార్థులు మరోసారి నిరసనకు దిగారు. అయితే అధికారులు విద్యార్థులను బెదిరింపులకు గురిచేశారన్న వార్తలు వచ్చాయి. నిరసనలో పాల్గొనే విద్యార్థులను డిస్మిస్ చేస్తామని అధికారులు ఒత్తిడి కూడా తెచ్చారని తెలుస్తోంది. విద్యార్థులు తల్లిదండ్రులు సైతం హైదరాబాద్ లో సబిత ఇంద్రారెడ్డి ఇంటి వద్ద కూడా బాసర ట్రిపుల్ ఐటీ లో నెలకొన్న సమస్యలపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వం హామీలను నెరవేరుస్తామని చెప్పినా ఆచరణలో లేవని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా పట్టించుికోవటం లేదని చివరికి రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలిసేందుకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు డిసైడ్ అయ్యారు. బుధవారం ట్రిపుల్ ఐటీకి చెందిన పది మంది విద్యార్థుల బృందం గవర్నర్ వద్దకు వెళ్లారు. ప్రభుత్వం ఎలాగూ తమ సమస్యలు పట్టించుకోవటం లేదు కనీసం ఛాన్సలర్ వద్దకైనా వెళ్లి తమగోడు వెళ్లబోసుకుందామని డిసైడ్ అయ్యారు స్టూడెంట్స్.