Yadagirigutta News: యాదాద్రి ఆలయ ఈవోపై బదిలీ వేటు, ఆ వివాదం తర్వాత దిద్దుబాటు!
Telangana News: రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.
Yadagirigutta News Lakshmi Narasimha Swamy: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి (Yadagirigutta Temple) గుడికి ప్రస్తుతం ఇన్‌చార్జ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) రామకృష్ణా రావుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యం చేశారని ఆలయ ఈవోని దేవాదాయ ధర్మాదాయ శాఖ బదిలీ చేసింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి కొత్త ఈవోగా భాస్కర్ రావుని గురువారం (మార్చి 14) తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో సీఎంకు, మంత్రులకు అక్కడి బ్రాహ్మణులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సమయంలో సీఎం, మిగతా మంత్రుల కంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలకు కాస్త తక్కువ ఎత్తు ఉన్న పీటలు వేశారు. సీఎం రేవంత్ దంపతులు, పొంగులేటి దంపతులు, ఉత్తమ్ దంపతులు కాస్త ఎక్కువ ఎత్తు ఉన్న పీఠలపై కూర్చోగా.. డిప్యూటీ సీఎం అయిన భట్టి విక్రమార్క మాత్రం కాస్త చిన్న పీఠపై కూర్చున్నారు.
ఈ విషయంపై వివాదం రాజుకుంది. భట్టి విక్రమార్కకు, పక్కనే మరో మంత్రి కొండా సురేఖకు అవమానం జరిగిందంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ అంశంపై మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. తానే కావాలని చిన్న పీఠపై కూర్చున్నానని తెలిపారు. దీంతో ఈ వివాదంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆలయ ఈవో రామకృష్ణరావుపై ట్రాన్స్ ఫర్ వేటు వేసింది. ఆయన స్థానంలో భాస్కర్‌రావుని ఆలయ ఈవోగా ప్రభుత్వం నియమిస్తూ జీవో జారీ చేసింది.