వెయ్యి కిలోమీటర్లు దాటిన "ప్రజాసంగ్రామ యాత్ర"
మూడో విడత పాదయాత్ర ఆగస్టు 2న ప్రారంభమై 15 రోజులుగా సాగుతోంది. ఈ విడతలో ఆయన మొత్తం 183 కి.మీలు నడిచారు.
తెలంగాణలో తెరాస పాలనకు చరమగీతం పాడాలనే లక్ష్యంతో ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటింది. యాత్ర ఆద్యంతమూ ప్రజల ఇబ్బందులను స్వయంగా తెలుసుకొంటూ, భరోసా ఇస్తూ కమలదళంతో కలిసి బండి సంజయ్ ఉత్సాహంగా ముందుకు నడిచారు. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లె స్టేజీ వద్ద వెయ్యి కిలోమీటర్ల మైలురాయికి గుర్తుగా పార్టీ కార్యకర్తలు నిర్మించిన పైలాన్‌ను బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు సంబరాలతో సందడి చేశారు. వెయ్యి బెలూన్లు ఎగరేసి, వెయ్యి షాట్స్ పేల్చారు. డప్పు వాద్యాలు, నృత్యాలతో కార్యకర్తలు ఉత్సాహం ప్రదర్శించారు.
తొలివిడత నుంచి నేటిదాకా
Live: Day 15 of #PrajaSangramaYatra3 https://t.co/y5I52DY6Za
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 17, 2022
ప్రజాసంగ్రామ పాదయాత్ర మొదటి విడత ఆగస్టు 28న పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమై అక్టోబర్ 2న హుస్నాబాద్‌లో ముగిసింది. తొలివిడతలో 36 రోజుల పాటు పాదయాత్ర చేసి 438 కిలోమీటర్లు నడిచారు. 19 అసెంబ్లీల్లో 9 జిల్లాలు, 6 ఎంపీ సెగ్మెంట్లలో పాదయాత్ర చేశారు.
రెండో విడత పాదయాత్రను బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న అలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభించి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మే 14న ముగించారు. 31 రోజులపాటు పాదయాత్ర చేసిన సంజయ్ 3 ఎంపీ, 9 అసెంబ్లీ, 5 జిల్లాల మీదుగా 383 కిలోమీటర్లు నడిచారు.
Opponents may throw stones at us, but we'll convert them to milestones. Planted sapling & unveiled pylon at Devaruppala Mandal to mark the milestone of 1000km of #PrajaSangramaYatra. pic.twitter.com/yq4CT1igbk
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 17, 2022
తాజాగా కొనసాగుతున్న మూడో విడత పాదయాత్ర ఆగస్టు 2న ప్రారంభమై 15 రోజులుగా సాగుతోంది. ఈ విడతలో ఆయన మొత్తం 183 కి.మీలు నడిచారు. ఈ 82 రోజుల పాదయాత్రలో బండి సంజయ్ అనేక ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు. వేలాది దరఖాస్తులను స్వీకరించడం సహా... వాటిని పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు.
రేపు తరుణ్ చుగ్ పర్యటన
రేపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సమావేశంకానున్నారు. అనంతరం జగిత్యాల జిల్లా కోరుట్లలో సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు.