Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే
అక్టోబరు 7 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 3 న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబరు 6 న కౌంటింగ్ ఉండనుంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబరు 7 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 3 న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబరు 6 న కౌంటింగ్ ఉండనుంది.
తెలంగాణలోని మునుగోడుతో పాటు దేశంలో ఖాళీ అయిన చోట్ల కూడా ఇదే తేదీల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్, బిహార్ లోని మోకమా, గోపల్ గంజ్, హరియాణాలోని ఆదమ్ పూర్, తెలంగాణలోని మునుగోడు, ఉత్తర్ ప్రదేశ్ లోని గోలా గోక్రన్నథ్, ఒడిశాలోని ధామ్ నగర్ నియోజకవర్గాలకు కూడా ఇదే సమయంలో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.
ముఖ్యమైన తేదీలు
- ఉప ఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ - అక్టోబరు 7, 2022
- నామినేషన్లకు ఆఖరి తేదీ - అక్టోబరు 14, 2022
- నామినేషన్ల పరిశీలన - అక్టోబరు 15, 2022
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - అక్టోబరు 17, 2022
- పోలింగ్ తేదీ - నవంబరు 3, 2022
- కౌంటింగ్ తేదీ - నవంబరు 6, 2022
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక
కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం వల్ల మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఆయన ఎంతో కాలం క్రితమే బీజేపీలో చేరతారని ప్రచారం జరగ్గా.. రెండు నెలల క్రితమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరాక మళ్లీ అక్కడి నుంచే పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. బీజేపీ అధిష్ఠానం కూడా రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు, మునుగోడును తామే దక్కించుకొని అక్కడ ప్రాబల్యం పెంచుకోవాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. తద్వారా బీజేపీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయాలని గులాబీ అగ్ర నేతలు భావిస్తున్నారు. కానీ, తన స్థానాన్ని తామే మళ్లీ దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తానికి మునుగోడు స్థానంలో గెలవడం అనేది మూడు పార్టీలకు జీవన్మరణ సమస్యగా తయారైంది.
మునుగోడు ఉప ఎన్నిక కోసం బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే ఖరారు కాగా, టీఆర్ఎస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ తరపున ఎలాగూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలుస్తారు. కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతిని నిలబెడుతున్నట్లుగా కొద్ది వారాల క్రితమే ప్రకటించారు. ఆమె మునుగోడు మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె. ఈయన మునుగోడు నుంచి చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పాల్వాయి స్రవంతి 2014 ఎన్నికల్లో మునుగోడు నుంచే పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2018 ఎన్నికల్లో ఆమె కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం పని చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనేది ఆసక్తిగా మారింది.