Election Code: అమల్లోకి ఎన్నికల కోడ్, మీ వద్ద అంతకు మించి డబ్బు ఉంటే జాగ్రత్త !
Election Code: తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది.
Election Code: దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం (Election Commission) నిఘా ఆయా రాష్ట్రాల్లో మొదలయ్యింది. నగదు, బంగారం ఇతర వస్తువుల తరలింపుపైనా ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఓటర్లను ప్రభావితం చేసేలా తాయిలాలు, నగదు పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలపై నిఘా ఉంటుంది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు జాగ్రత్తగా ఉండాల్సిందే.
నిబంధనల ప్రకారం, రూ.50 వేల వరకే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకు మించి డబ్బు, బంగారం, ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే సామగ్రి ఉంటే వాటిని పోలీసులు సీజ్ చేస్తారు. పోలీసులు, అధికారుల తనిఖీల్లో సరైన పత్రాలు చూపించకుంటే.. వాటిని సీజ్ చేసే అవకాశం ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆధారాలు చూపిస్తేనే వాటిని తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, శుభకార్యాలు, ఇతర అవసరాలకు అధిక మొత్తంగా నగదు తీసుకెళ్లేవారు పలు జాగ్రత్తలు తీసుకోసుకోవడం తప్పనిసరి. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల అధికారులు, పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తుంటారు. లెక్కలు, ఆధారాలు లేని డబ్బు దొరికితే సీజ్ చేస్తారు.
తెలంగాణకు నాలుగు రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. మొత్తం148 చెక్‌పోస్టులు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఎవరైనా తమ వెంట పెద్ద మొత్తంలో నగదు తీసుకువెళ్తుంటే, అందుకు సంబంధించిన ఆధారాలు, ధ్రువపత్రాలను వెంటే ఉంచుకోవడం ఉత్తమం. ఆసుపత్రిలో చెల్లింపుల కోసం ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్తే.. రోగి రిపోర్టులు, ఆసుపత్రి రశీదులు, ఇతర డాక్యుమెంట్లు తమ వెంట ఉంచుకోండి. ఏదైనా అవసరాల కోసం బ్యాంకు నుంచి నగదు డ్రా చేస్తే.. ఖాతా పుస్తకం లేదా ఏటీఎం చీటీ వంటివి తప్పనిసరిగా దగ్గర పెట్టుకోండి.
వస్తువులు, ధాన్యం విక్రయం డబ్బు అయితే వాటికి సంబంధించిన బిల్లు చూపించాల్సి ఉంటుంది. భూమి విక్రయించిన సొమ్ము అయితే వాటికి దస్తావేజులు చూపాలి. వ్యాపారం, ఇతర సేవల కోసం డబ్బు వినియోగిస్తే లావాదేవీల వివరాలను ఆధారాలతో అధికారులకు చూపించాలి. అలా లేని పక్షంలో మీరు డబ్బు, వస్తువులతో తనిఖీల్లో దొరికినట్లయితే ఎన్నికల అధికారులు, పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆ డబ్బు సీజ్ చేస్తారు. ఎన్నికలు ముగిసే వరకు ఆ డబ్బు తిరిగి ఇవ్వరు. అప్పుడు కూడా సరైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఎక్కువ మొత్తంలో నగదు లభ్యమైతే ఐటీ, జీఎస్టీ అధికారులు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. నిబంధనల ప్రకారం, రూ.50 వేల వరకే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. నగదు మాత్రమే కాదు బంగారం, ఆభరణాలు భారీస్థాయిలో తీసుకెళ్లినా ఇబ్బందే.