Eatala Rajender: ఒక్క ఎకరా కబ్జా అని తేలినా ముక్కు నేలకు రాస్తా.. చదువుకున్న.. ఆ చదువులేని కలెక్టర్‌పై కేసు పెడతా: ఈటల
సంగారెడ్డి జిల్లాలో బీజేపీ రెండు రోజుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఈటల సోమవారం హాజరయ్యారు. మెదక్ కలెక్టర్ ఆరోపణల నేపథ్యంలో ఈటల మీడియాతో మాట్లాడారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చెందిన జమునా హేచరీస్‌కు సంబంధించిన భూముల్లో కబ్జా ల్యాండ్స్ ఉన్నాయని మెదక్ కలెక్టర్ హరీశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న తానే రైతులను బెదిరించి 70 ఎకరాల అసైన్డ్ భూములను తీసుకుని ఉంటే.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ ఇంక ఎంత మందిని భయపెట్టి హైదరాబాద్ కొండాపూర్, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో ఎన్ని వేల ఎకరాలు తీసుకుని ఉంటారోనని ఆరోపించారు. తనది కనీసం తొండలు గుడ్లు కూడా పెట్టని భూమి ఈటల రాజేందర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో బీజేపీ రెండు రోజుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన సోమవారం హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
జమునా హేచరీస్ సంస్థలో ఒక్క ఎకరం కబ్జాలో ఉన్నట్టు తేలినా ముక్కు నేలకు రాస్తానని తన భార్య జమున చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని ఈటల రాజేందర్ సవాలు విసిరారు. వ్యవస్థ అనేది ఉందని, అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని హితవు పలికారు. తాను భూములు కబ్జా చేశానని అనడం మతిలేని చర్య అని ఈటల రాజేందర్ కొట్టిపారేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వారి అంతరాత్మ ప్రాతిపదికగా ఓటేయాలని ఈటల ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లకు పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు.
చదువుకున్న ఆ చదువులేని కలెక్టర్!: ఈటల జమున
మరోవైపు, ఇదే అంశంపై ఈటల రాజేందర్ భార్య ఈటల జమున కూడా స్పందించారు. ‘‘భూములకు సంబంధించిన అంశం కోర్ట్ పరిధిలో ఉంది. మాకు ఎటువంటి వివరాలు ఇవ్వకుండా.. ప్రెస్ మీట్ ఎలా పెడతారు. కలెక్టర్‌లు ప్రెస్ మీట్ పెట్టడానికే ఉన్నారా ధరణిలో ఎంట్రీ అయిన భూములనే మేము కొన్నాం. లాయర్ ద్వారా లీగల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అంటే ధరణి వల్ల ఉపయోగం లేదా.. ధరణిలో ఉన్న భూములన్ని ఫేకేనా.. చదువుకున్న కలెక్టర్ ఆ.. చదువులేని కలెక్టర్ ఆ.. కలెక్టర్ హోదా లేకుండా మాట్లాడుతున్నాడు.
సర్వే నెంబర్ 81లో మాకు ఉన్నది 5 ఎకరాల 30 గుంటలే.. సర్వే నెంబర్ 130 లో మూడు ఎకరాలు ఉంది.. కానీ కలెక్టర్ మాత్రం 70 ఎకరాలు ఆక్రమించారు అని చెపుతున్నాడు. మేము ఎవరి దగ్గర భూమి గుంజుకుని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. టీఆర్ఎస్ కండువా కప్పుకొని కలెక్టర్‌లు పనిచేస్తున్నారు. 2018లో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. అన్ని రకాల అనుమతులు వచ్చాకే షెడ్స్ నిర్మాణం చేశాం. మొన్నటి వరకు ధరణిలో ఉన్న భూమిని ఇప్పుడు ప్రైవేటు భూమిగా చూపిస్తుంది.
రేపు కలెక్టర్ పై కేసు పెడతాం..
‘‘నాలా కనెక్షన్ కు అప్లికేషన్ పెట్టినా ఇవ్వట్లేదు. చాలా మంది రాజకీయ నాయకులకు హేచరీస్ ఉన్నాయి. మరి వాటి దగ్గర పొల్యూషన్ రాదా. పొల్యూషన్ సర్టిఫికెట్ కావాలని ఇప్పుడు అడుగుతున్నారు. ఈటలను రోడ్డు మీద వేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఫీడ్ ప్లాంట్ పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాం. జమునా హేచరిస్ కు అధికారులు సహకరించొద్దని చెప్తున్నారు. ప్రభుత్వం ఓక వ్యక్తి మీద టార్గెట్ చేస్తుంది. అధికారుల సర్వేను కోర్ట్ తో పాటు మాకు కూడా ఇవ్వాలి. కేసీఆర్ ఇలానే చేస్తే ఈటల అన్ని జిల్లాలు తిరిగి కేసీఆర్ బండారం బయటపెడతారు. కేసీఆర్ రాజకీయ కక్ష్య సాదింపు మానుకోవాలి.’’ అని ఈటల జమున మాట్లాడారు.
Also Read: Shreya Muralidhar : కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: Journalist: కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 2 లక్షల సాయం.. డిసెంబర్ 15న పంపిణీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి