Durgam Chinnaiah: ఆరిజిన్ మోసాలు బయటపెట్టినందుకే నాపై దుష్ప్రచారం: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Durgam Chinnaiah: తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. ఆరిజిన్ డైరీ నిర్వాహకుల మోసాలను బయటపెట్టినందుకే అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు.

Durgam Chinnaiah: ఆరిజిన్ డైరీ నిర్వాహకుల మోసాలను బయటపెట్టినందుకే సోషల్ మీడియాలో తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చిన్నయ్య.. రైతులను మోసం చేసిన ఆరిజిని డైరీ నిర్వాహకులు ఆదినారాయణ, శైలజలను అరెస్టు చేయినందుకే తనపై కక్ష కట్టారని తెలిపారు.
ఆరిజిన్ డైరీ మోసాలు బయటపెట్టడంతో పాటు ప్రజల్లో తనకు ఉన్న మంచి పేరుతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తాననే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక కొంత మంది ధనవంతులు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక దళిత ఎమ్మెల్యేనైనా తనను అభాసుపాలు చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.
అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అన్ని పేపర్ లీక్ ల వెనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉందని, పేపర్లు లీక్ చేసి విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపైన బురదజల్లే ప్రయత్నాలు మానుకోకపోతే ప్రజల చేతుల్లో బీజేపీకి బుద్ధి తప్పదని హెచ్చరించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే. వెంటనే బండి సంజయ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు దుర్గం చిన్నయ్య. అదే విధంగా బెల్లంపల్లి ప్రజల చిరకాల కోరిక శాశ్వత ఇండ్లపట్టాల మంజూరును కూడా వేగవంతం చేయడమే కాకుండా దరఖాస్తు తేదీని కూడా మరోసారి పొడిగించామని, ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో కూడా ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, బెల్లంపల్లి ప్రజలెవరూ ప్రతిపక్షాల మోసపూరిత మాటలను నమ్మవద్దని సూచించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఆడియో, కొన్ని వాట్సాప్ చాటింగ్ వివరాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. బెల్లంపల్లిలో ఆరిజిన్ పాల సంస్థను ప్రారంభించడానికి తమ వద్ద భారీగా ముడుపులు తీసుకొని తమ మీదనే ఉల్టా కేసులు పెట్టించాడని సంస్థ పార్టనర్ శైలజ ఆరోపించారు. ఆయనకి తెలిసిన వ్యక్తులను ఇందులో షేర్ హోల్డర్స్ గా ఉంచాలని ఎమ్మెల్యే చెప్పారని, తాము కూడా ఒప్పుకున్నామని అన్నారు. తమతో వచ్చిన ఓ అమ్మాయిని కావాలని ఎమ్మెల్యే కోరాడని ఆరోపించారు. వేరే బ్రోకర్ ల ద్వారా అమ్మాయిల సప్లై గురించి శైలజ ఆరోపించారు. అమ్మాయిల సప్లై కోసం వాట్సప్ లో టాబ్లెట్ అనే కోడ్ వాడారని ఆరోపించారు.
చాలా సార్లు అతనికి అమ్మాయిలను సప్లై చేశారని చెప్పారు. తననతో బలవంతంగా మందు తాగించే ప్రయత్నం చేశాడని, లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు. తమని అతని ఇంటికి పిలిపించి పోలీసులకు అప్పజెప్పాడని ఆమె వెల్లడించింది. పోలీసులు కూడా ఎమ్మెల్యే చిన్నయ్య కే వత్తాసు పలుకుతున్నారని, రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తనకు ఎమ్మెల్యే, ఆయన అనుచరుల ద్వారా ప్రాణహాని ఉందంటు శైలజ ఆరోపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

