KTR: మేము వచ్చాక హిల్ట్ పాలసీ రద్దు భూములన్నీ స్వాధీనం - కేటీఆర్ సంచలన ప్రకటన
Hilt policy : తాము వచ్చాక హిల్ట్ పాలసీ రద్దు చేసి భూములను స్వాధీనం చేసుకుంటామని పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. షాపూర్ నగర్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోఆయన పర్యటించారు.

KTR warns industrialists: కాంగ్రెస్ ప్రభుత్వం HILTP పాలసీ పేరుతో 5 లక్షల కోట్ల రూపాయల భారీ భూమి కుంభకోణానికి పాల్పడుతున్నదని కేటీఆర్ ఆరోపించారు. మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అక్కడి పరిశ్రమల కార్మికులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలు పరిశ్రమల కోసం ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు.
పరిశ్రమలు వద్దు అంటూ అపార్ట్మెంట్లు విల్లలు కమర్షియల్ కాంప్లెక్స్ లు కట్టుకోమని పారిశ్రామిక భూములను ఇస్తున్నదని.. ప్రభుత్వం చెబుతున్నట్లు అవి ప్రైవేటు వ్యక్తుల భూములు కావు ప్రైవేట్ వ్యక్తులకు ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన భూములన్నారు. అందులో కేవలం పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలన్న నిబంధనలతోనే ఆ భూములను ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. లక్షన్నర రూపాయలకు గజం ధర మార్కెట్లో పలుకుతుంటే కేవలం 4000 రూపాయలకు ప్రవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నదని.. హైదరాబాద్ నగరంలో ఇండ్లకు పాఠశాలలకు ఆసుపత్రులకు చివరికి స్మశానాలకు స్థలం లేదు కానీ ప్రైవేట్ వ్యక్తులకు 9300 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పనంగా ఇస్తామంటున్నదని మండిపడ్డారు.
ఈ తొమ్మిది వేల 300 ఎకరాల భూములను తిరిగి వెనక్కి తీసుకొని అక్కడ కాంగ్రెస్ చెప్తున్నా ఇందిరమ్మ ఇండ్లు యంగ్ ఇండియా స్కూల్స్ ఆసుపత్రులు కట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో స్థలం లేదని చెప్పి ఇప్పటిదాకా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ కట్టలేదని గుర్తు చేశారు. ఇక్కడ ఉన్న కంపెనీలు తరలి వెళ్తే హైదరాబాద్ నగరంలో వాటిపైన ఆధారపడిన లక్షల మంది ఉపాధి పోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కుంభకోణాన్ని ప్రజల కి వివరించేందుకే ఈరోజు పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తున్నామని..
కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్న భూముల ధర నిర్ధారణ దాని వెనుక ఉన్న అసలు నిజాలు నిర్ధారణ జరగాలన్న ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేస్తున్నామన్నారు.
ఈ అంశాన్ని ఇక్కడితో మా పార్టీ వదిలిపెట్టదని.. కాంగ్రెస్ పార్టీ హిట్ పాలసీ కుంభకోణం పైన త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నగరంలో కాలనీలలో ప్రజలకు ఈ అంశాన్ని వివరిస్తాము.. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశాలు నిర్వహిస్తాము ..ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకు పోతామని ప్రకటించారు. ఈ పాలసీని వెనక్కి తీసుకొని లక్షల కోట్ల ప్రజల భూమిని కాపాడే దాకా మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మా ప్రభుత్వం రాగానే ఈ పాలసీది రద్దు చేస్తాము ..అవసరమైతే ఇందుకోసం ఒక చట్టాన్ని తీసుకువస్తాము ...ఈరోజు రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఎవరైనా అత్యాశకు వెళ్లి ప్రభుత్వానికి డబ్బులు కడితే అటు పారిశ్రామిక భూములతో పాటు డబ్బులు కూడా పోతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇంతటి భారీ కుంభకోణాన్ని దోపిడీని చూసి తట్టుకోలేక తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న తెలంగాణ బిడ్డ మాకు సమాచారం ఇచ్చారని.. ప్రభుత్వం చేస్తున్న దోపిడీ పైన మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సమాచారం లీక్ అయింది అంటూ బాధపడుతున్నదన్నారు. చిత్తశుద్ధి ఉంటే తమ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ పైన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.




















