Telangna Congress government: అత్యంత రహస్య సమాచారం లీక్ - ప్రభుత్వంపై సీఎం రేవంత్ ఇంకా పట్టు సాధించలేదా ?
Telangana government:తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత రహస్య సమాచారం బీఆర్ఎస్‌కు చేరుతోందని గుర్తించారు. ప్రభుత్వ పెద్దలకు అత్యంత నమ్మకస్తులైన వారే ఈ పని చేస్తున్నారు.

CM Revanth not yet gained control over the bureaucracy: తెలంగాణ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రెండేళ్ల పాలనా ఉత్సవాలపై పెద్దగా చర్చ జరగడం లేదు. డిసెంబర్ మూడో తేదీన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రోజు. కానీ పార్టీ నేతలకు ఈ విజయం గుర్తు లేదు. వారంతా.. ఒకే అంశంపై గుసగుసలాడుకుంటున్నారు. ఆ అంశం.. ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కోవర్టులు అత్యున్నత స్థాయిలో ఉన్నారని గుర్తించడమే. చాలాకాలంగా అత్యంత రహస్యమైన సమాచారం బీఆర్ఎస్‌కు చేరుతోంది. హిల్ట్ పాలసీపై ముందస్తుగా జీవో కాపీ సైతం కేటీఆర్‌కు చేరడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. విజిలెన్స్ దర్యాప్తు చేయించింది.
బీఆర్ఎస్‌కు రహస్య సమాచారం ఇస్తోంది రేవంత్ బాగా నమ్మిన వ్యక్తేనా?
హిల్ట్ పాలసీ గురించి ప్రభుత్వం చాలా అత్యున్నత స్థాయిలో కసరత్తు చేసింది. కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలనుకునేవరకూ మంత్రులకు కూడా తెలియదు. విధివిధానాలు అన్నీ కసరత్తు చేసి డ్రాఫ్ట్ గా నోట్ తయారు చేసుకున్నారు. అయితే ఆ దశలోనే బీఆర్ఎస్ వద్దకు సమాచారం చేరిపోయింది. ప్రభుత్వం ఎవరికీ తెలియదనుకుంటున్న సమయంలోనే హిల్ట్ పాలసీ గురించి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఐదు లక్షల కోట్ల స్కాం అని ఆరోపణలు చేశారు. దంతో ఆశ్చర్యపోవడం ప్రభుత్వ పెద్దల వంతు అయింది. అనుకున్నంత తేలికగా రాజకీయం లేదని తమ వద్దనే బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని గుర్తించారు.
నమ్మకస్తుడిగా గుర్తింపు పొందిన ఓ వ్యక్తిపనేనని గుర్తించారా?
సాధారణంగా అధికారుల స్థాయిలో సమాచారం లీక్ అవుతుంది. కానీ అధికారులు ఎలాంటి డాక్యుమెంట్లు ఫార్వార్డ్ చేయరు. అలాంటి రిస్క్ తీసుకోలేరు. నోటిమాటగా సమాచారం ఇవ్వగలరు. కానీ హిల్ట్ పాలసీ విషయంలో డాక్యుమెంట్లు కూడా బీఆర్ఎస్ ముఖ్యనేతలకు షేర్ అయ్యాయని విజిలెన్స్ గుర్తించింది. ఆయన ఎవరో కూడా కనిపెట్టారు. ప్రభుత్వం ఏర్పడగానే ఆయనకు మీడియా విభాగంలో కీలక బాధ్యతలు ఇచ్చారు. తర్వాత రాజ్యాంగ బద్దమైన పదవి కూడా ఇచ్చారు. ఆయన వివిధ పాలసీల విషయంలో మీడియాతో డీల్ చేయాల్సిన వ్యూహాలను ఖరారు చేస్తున్నారని అంటున్నారు. ఆయన నుంచే లీక్ అయిందని..సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని ఆయన పూర్తిగా వమ్ము చేశాడని అంటున్నారు. ఇది చిన్న విషయం కాదు.
ఇప్పటి వరకూ కీలక సమాచారమంతా లీక్ అయిందా ?
ప్రభుత్వానికి సమాచార గోప్యత చాలా ముఖ్యం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పకపోతే చాలా అపోహలు వస్తాయి. ప్రస్తుతం హిల్ట్ పాలసీ గురించే తీసుకుంటే...అసలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకముందే.. బీఆర్ఎస్ పార్టీ... స్కాం పేరుతో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అవే ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రభుత్వం తన వాదనను బలంగా చెప్పలేకపోతోంది. దీనికి కారణం ఈ లీకేజీనే. ఇలాంటివి గతంలోనూ జరిగాయి కానీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేపోయింది. అసలు ఎవరు సమాచారాన్ని లీక్ చేస్తున్నారో మాత్రం గుర్తించలేకపోయారు. ఫలితంగా ఇప్పుడు తీవ్రంగా చిక్కుల్లో పడాల్సి వస్తోంది.
అంత ధైర్యం వచ్చిందంటే సీఎంకు ప్రభుత్వంపై పట్టు చిక్కనట్లే !
ప్రభుత్వంలో కీలక పొజిషన్లలో అత్యంత నమ్మకస్తులైన వారే ఉంటారు. వారు ఎంత నమ్మకంగా ఉండాలంటే.. ప్రాణం పోయినా సమాచారం బయట పెట్టకూడదు. అలా పెట్టేవారు ఉన్నారంటే.. ముఖ్యమంత్రి ప్రభుత్వంపై పట్టు సాధించలేదని అనుకుంటారు. అందుకే ప్రస్తుతం.. కోవర్టుగా గుర్తించిన కీలక వ్యక్తి విషయంలో ప్రభుత్వం కిందా మీదా పడుతుంది. ఎలాంటి కారణం అయినా సరే.. ఇలాంటి పరిస్థితి రావడం కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.




















