BRS MLC Candidates : బీఆర్ఎస్ ముగ్గురు ఎమ్మెల్సీలు వీళ్లే - ఎవరూ ఊహించని అభ్యర్థులు !
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. 9వ తేదీన నామినేషన్లు వేయనున్నారు.
BRS MLC Candidates : బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. ఎ దేశపతి శ్రీనివాస్ , , కుర్మయ్యగారి నవీన్ కుమార్ , చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను సీఎం ఖరారు చేశారు. ఈ నెల 9వ తేదీన నామినేషన్లు దాఖలు చేయాలని ఆ ముగ్గురు అభ్యర్థులకు కేసీఆర్ సూచించారు. నామినేషన్ల దాఖలుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా… రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర్మయ్యగారి నవీన్ కుమార్‌కు పొడిగింపు !
ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న కూర్మయ్యగారి నవీన్ కుమార్ కు కేసీఆర్ మరో చాన్సిచ్చారు. సుదీర్ఘ కాలంగా కేసీఆర్ వెంటే ఉన్న ఆయన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. .2018లో తెలంగాణ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ రావును కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన 2019 జూన్ 7లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి పొడిగింపు ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో వెలుగులోకి వచ్చిన దేశపతి శ్రీనివాస్
దేశపతి శ్రీనివాస్ తెలంగాణ ఉద్య మసమయంలో వెలుగులోకి వచ్చారు. ఆయన పాటలు పాడతారు. మంచి వాగ్దాటి ఉంది. కేసీఆర్అభిమానం పొందిన ఆయన... టీచర్ గా ఉంటూ.. సీఎంవోలో ఓఎస్డీగా చేసేవారు. అయితే టీచర్లను డిప్యూటేషన్ పై పంపించవద్దన్న సుప్రీం ఆదేశాల నేపథ్యంలో.. ఆయన్ను ఓఎస్డీ నుంచి తప్పించడం.. ఆ తర్వాత ఆయన తన టీచర్ పోస్టుకు రాజీనామా చేయడం జరిగిపోయాయి. దేశపతి పెట్టుకున్న వీఆర్ఎస్‌కు ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అప్పట్నుంచి ఆయన పలు సందర్భాల్లో దేశపతి శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఇన్నాళ్లకూ ఆయన పేరును ఖరారు చేశారు.
నీలం సంజీవరెడ్డి మనమడు చల్లా వెంకట్రామిరెడ్డి !
మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కుమార్తె కుమారుడు , అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి. చల్లా వెంకట్రామిరెడ్డి జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయంగా పట్టు, మంచి పేరు ఉన్న రాజకీయ కుటుంబానికి చెందినవారు. ఆయన ఇటీవలే బీఆర్ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా అధికారికంగా ఆవిర్భవించిన తరువాత ఇదే తొలి చేరిక చల్లా వెంకట్రామిరెడ్డితే. అప్పట్లోనే చురుకైన రాజకీయ నాయకుడైన చల్లా వెంకట్రామిరెడ్డికి పార్టీలో తగు స్థానం కల్పించి, ఆయన సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ జాతీయ విధానాలు నచ్చి తాను బీఆర్‌ఎస్‌లో చేరానని, పార్టీ ప్రకటన తర్వాత తొలి చేరిక తనదే కావడం సంతోషంగా ఉన్నదని చల్లా తెలిపారు. అధినేత ఆదేశాలను అనుసరిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు. అన్న మాట ప్రకారం ఎమ్మెల్సీ ఇచ్చారు.